Vijayawada floods : వరద ముంపులో చిక్కుకున్న వారికోసం హెలికాప్టర్లు.. ఆహారం కోసం అల్లాడుతున్న ప్రజలు
Vijayawada floods : విజయవాడ సింగ్ నగర్‌లో వరద బాధితులు కష్టాలు పడుతున్నారు. తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిత్యావసరాలు, మంచి నీరు తీసుకువెళ్లేందుకు తిప్పలు పడుతున్నారు. నాలుగు అడుగుల లోతు నీటిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.
విజయవాడ నగరంలో వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు.. ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి.. వందకు పైగా ట్రాక్టర్లు ముంపు ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ క్రేన్లను కూడా అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లోకి బోట్లు, ట్రాక్టర్లు, క్రేన్లు మాత్రమే వెళ్లే పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. అటు విజయవాడలోని సింగ్ నగర్ ఇంకా వరదల్లోనే నానుతోంది.
ఆకలితో అల్లాడిపోతున్నారు..
విజయవాడలోని అనేక వరద ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం డ్రోన్లు, హెలీకాప్టర్ల ద్వారా ఆహారం, నీరు అందిస్తున్నా.. అందరికీ అందడం లేదని చెబుతున్నారు. విజయవాడ వరద బాధితులకు మేఘా సాయం అందించేందుకు ముందుకొచ్చింది. లక్షన్నర మందికి అల్పాహారం, భోజనం, వాటర్ బాటిల్స్ అందివ్వాలని నిర్ణయించింది. హరేకృష్ణ సంస్థ సహకారంతో ఆహారం పంపిణీ చేయనుంది. విజయవాడ కలెక్టరేట్‌లో మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రతినిధులు ఆహారం అందించనున్నారు.
రంగంలోకి నేవీ..
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుండి మూడు హెలీకాప్టర్లు వచ్చాయి. హకింగ్ పేట ఎయిర్ బేస్ నుండి మరో నాలుగు హెలీకాప్టర్లు రానున్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు.
ఉత్తరాంధ్రకు ముప్పు..
ఉత్తరాంధ్రకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నెల 5 నాటికి ఏర్పాడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
హైవే రెడీ..
విజయవాడ -హైదరాబాద్ హైవేపై రాకపోకలు ప్రారంభం కానున్నాయి. సోమవారం వరకు మాచర్ల మీదుగా వెళ్లిన బస్సులు.. ఇప్పుడు నందిగామ మీదుగా ప్రయాణిస్తున్నాయి. వంతెన గండి పడటంతో సింగిల్ రూట్‌లో వెళుతున్నాయి. సర్వీసుల పునరుద్ధరణతో హైదరాబాదు ప్రయాణానికి ప్రయాణికులు సిద్ధమవుతున్నారు.