Garikapadu NH Road : గరికపాడు వద్ద కొట్టుకుపోయిన హైవే, హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు బంద్-ap telangana transport vehicle stalled due to garikapadu bridge road washed away ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Garikapadu Nh Road : గరికపాడు వద్ద కొట్టుకుపోయిన హైవే, హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు బంద్

Garikapadu NH Road : గరికపాడు వద్ద కొట్టుకుపోయిన హైవే, హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు బంద్

Bandaru Satyaprasad HT Telugu
Sep 02, 2024 02:21 PM IST

Garikapadu NH Road : ఏపీ, తెలంగాణ సరిహద్దులో గరికపాడు వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై సుమారు 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. కోదాడ వైపు వస్తున్న వాహనాలను మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు.

గరికపాడు వద్ద కొట్టుకుపోయిన హైవే, హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు బంద్
గరికపాడు వద్ద కొట్టుకుపోయిన హైవే, హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు బంద్

Garikapadu NH Road : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రహదారుల పై నుంచి వరద ప్రవహిస్తుంది. దీంతో వాహన రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఏపీ, తెలంగాణ సరిహద్దులో గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌ వద్ద సరకు లారీలను నిలిపివేశారు. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో మరో మార్గం లేక లారీలు, కార్లు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనదారులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. రాత్రి నుంచి రోడ్లపైనే ఉంటూ, అక్కడే భోజనాలు చేస్తున్నారు. కోదాడ వరకు వస్తున్న వాహనాలను పోలీసులు మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. వాహనదారులు కోదాడ వైపు రావద్దని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి కోరుతున్నారు.

ఉద్ధృతంగా పాలేరు వాగు

ఏపీ, తెలంగాణను కలిపే పాలేరు వంతెనను తాత్కాలికంగా మూసివేశారు. పాలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రోడ్డు కుంగిపోయింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం దాటిన తర్వాత రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద వంతెన చివర్లో రోడ్డు కుంగిపోయింది. ఏపీలోని చిల్లకల్లు, నందిగామ వద్ద ఎన్.హెచ్ 65 పై వరద నీరు చేరింది. భారీ వర్షాల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రయాణం మానుకోవాలని పోలీసులు సూచించారు.

 పాలేరు వంతెన
పాలేరు వంతెన

ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేత

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో బ్యారేజీపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. బ్యారేజీ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 11.40 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 24.4 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదలో కొట్టుకుని వచ్చిన మూడు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్లు తెరచినా బోట్లు అడ్డుపడడంతో నీరంతా నిలిచిపోయింది. బోట్లు తగలడంతో బ్యారేజీలోని ఓ పిల్లర్‌ పాక్షికంగా దెబ్బతింది.

సంబంధిత కథనం