IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. సెప్టెంబర్‌ నెలలో ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం!-weather update imd rain alert to andhra pradesh and telangana these states likely to see heavy rain in september ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. సెప్టెంబర్‌ నెలలో ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం!

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. సెప్టెంబర్‌ నెలలో ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం!

Anand Sai HT Telugu
Sep 01, 2024 10:27 PM IST

IMD Weather Update : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడ, హైదరాబాద్‌లాంటి నగరాల్లోనూ వానలు విపరీతంగా పడుతున్నాయి. మరికొన్ని రోజులు వివిధ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నట్టుగా ఐఎండీ హెచ్చరించింది.

ఏపీ, తెలంగాణలో వర్షాలు
ఏపీ, తెలంగాణలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల విజయవాడలో ఐదుగురు సహా ఆంధ్రప్రదేశ్‌లో శనివారం జరిగిన వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో పది మంది మరణించారు. తెలంగాణలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో..

భారత వాతావరణ శాఖ (IMD) సెప్టెంబర్ 1 ఆదివారం నాడు తెలంగాణలోని అన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే సూచన ఉందని తెలిపింది. ఇప్పటికే అధికారులను చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్, నారాయణపేట, ఖమ్మం, తదితర జిల్లాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు హైదరాబాద్‌లో సిద్ధంగా ఉన్నాయి. భాగ్యనగరంలో రెండు రోజులుగా వానలు పడుతూనే ఉన్నాయి.

ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి), రాష్ట్ర సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పొంగిపొర్లుతున్న వాగులను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో రెండుమూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా.

ఆంధ్రప్రదేశ్‌లో..

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కొండచరియలు విరిగిపడిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇక విజయవాడలో పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తుతున్నాయి.

అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి కళింగపట్నం దగ్గర తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ రాష్ట్రాల్లో వానలు

సెప్టెంబరులో దేశం మొత్తం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ఉత్తర బీహార్, ఈశాన్య యూపీ, ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వానలు పడే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరదలు, కొండచరియలు విరిగిపడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.