TG School Holidays : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని విద్యా సంస్థలకు సెలవు-monday is a holiday for government and private educational institutions in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg School Holidays : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని విద్యా సంస్థలకు సెలవు

TG School Holidays : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని విద్యా సంస్థలకు సెలవు

Basani Shiva Kumar HT Telugu
Sep 01, 2024 01:44 PM IST

TG School Holidays : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 2 సోమవారం నాడు సెలవు ప్రకటిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తొలుత హైదరాబాద్ నగరంలోని విద్యా సంస్థలకే సెలవు ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని పరిగణలోకి తీసుకొని.. రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది.

తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు..

రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులు అలెర్ట్ అయ్యారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

రేవంత్ అత్యవసర సమీక్ష..

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో ఆదేశించారు.

సీఎస్ ఫోకస్..

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో.. సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఫోకస్ పెట్టారు. సచివాలయం నుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్లు, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి.. సూచనలు చేస్తున్నారు. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను కలెక్టర్లు ఎప్పటికప్పుడు తెలుసుకొని.. చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఐఎండీ హెచ్చరికలు..

ఐఎండీ హైదరాబాద్ రిపోర్ట్ ప్రకారం… ఇవాళ(సెప్టెంబర్ 1) తెలంగాణలో చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ సమయంలో ఎలాంటి హెచ్చరికలు లేవని తాజా బులెటిన్ లో పేర్కొంది.

Whats_app_banner