Hyderabad Rain Alert: హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు.. ప్రధానమైన 10 ముఖ్యాంశాలు-top 10 highlights about heavy rains in hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rain Alert: హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు.. ప్రధానమైన 10 ముఖ్యాంశాలు

Hyderabad Rain Alert: హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు.. ప్రధానమైన 10 ముఖ్యాంశాలు

Basani Shiva Kumar HT Telugu
Sep 01, 2024 10:50 AM IST

Hyderabad Rain Alert: హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు మూడు గంటల్లో మళ్లీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలపై 10 కీలక అంశాలు ఇవి.

హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు
హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు (X)

హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం.. క్రమంగా పెరిగింది. రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌ ఏర్పడి జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో కనీసం కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో.. వివిధ విభాగాల అధికారులు అలెర్ట్ అయ్యారు.

ముఖ్యమైన 10 అంశాలు..

1. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా.. హయత్‌నగర్‌, ఉప్పల్‌, కుత్‌బుల్లాపూర్‌, ముషీరాబాద్‌, మూసాపేట్‌, బేగంపేట, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.

2. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో రెప్పపాటులో మోకాళ్ల లోతు నీరు వచ్చింది. నగరవాసులు నిద్ర లేచి చూసేసరికి ఇంట్లోకి నీరు చేరింది. యూసుఫ్‌గూడ ఏరియాలో ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. దీంతో పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తాయని ఆ ప్రాంత వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

3. వర్షం కారణంగా ట్రాఫిక్‌‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. రసూల్‌పురా సిగ్నల్ నుండి ప్యారడైజ్ జంక్షన్‌కి కేవలం కిలోమీటరు దూరం రావడానికి దాదాపు గంట పట్టిందని వాహనదారులు చెబుతున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు.

4.నగరంలో అత్యధికంగా హయత్‌నగర్‌లో 18.5 మిమీ, సరూర్‌నగర్‌లో 17 మిమీ, సికింద్రాబాద్‌లో 15.6 మిమీ, ఫలుక్‌నామాలో 15.3 మిమీ, వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. డ్రైనేజీ కాల్వలు ఇప్పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ఈ ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.

5.హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2-3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు బాలాజీ హెచ్చరించారు. ఆదివారం కూడా నగర వ్యాప్తంగా చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని బాలాజీ అంచనా వేశారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉంటే సురక్షితం అని స్పష్టం చేశారు.

6.హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలపై చిరంజీవి ట్వీట్ చేశారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మీ కుటుంబ సభ్యుడిగా మనవి చేస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.

7.భాగ్యనగరంలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించినట్టు కలెక్టర్‌ వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

8.హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ హెచ్చరించింది. వచ్చే రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జోనల్‌ కమిషనర్లు, డీఆర్‌ఎఫ్‌ బృందాలు అలర్ట్ అయ్యాయి.

9.భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. త‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టాలని సీఎస్, డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించారు.

10.భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. సికింద్రాబాద్ నుంచే వేళ్లే పలు సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ సిటీలో తిరిగే బస్సు సర్వీసులు కూడా తగ్గాయి. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో సర్వీసులు నడవడం లేదు. వాహనదారులు కూడా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.