Hydra: కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. అక్బరుద్దీన్ ఓవైసీ కీలక కామెంట్స్-akbaruddin owaisi key comments on the news that hydra will demolish fatima college ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra: కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. అక్బరుద్దీన్ ఓవైసీ కీలక కామెంట్స్

Hydra: కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. అక్బరుద్దీన్ ఓవైసీ కీలక కామెంట్స్

Basani Shiva Kumar HT Telugu
Aug 26, 2024 01:57 PM IST

Hydra: హైడ్రా కూల్చివేతలపై రాజకీయ నాయకులు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై రియాక్ట్ అయిన ఓవైసీ.. కీలక కామెంట్స్ చేశారు.

అక్బరుద్దీన్ ఓవైసీ
అక్బరుద్దీన్ ఓవైసీ ((ANI))

హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేస్తోంది. అయితే.. ఈ చర్యలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. కాంగ్రెస్ నేతలు హైడ్రా చర్యలను సపోర్ట్ చేస్తుంటే.. ఇతర పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు.

'కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. కానీ ఆ స్కూల్ కూల్చకండి. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగ్‌లు నిర్మించా. వాటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కత్తులతో దాడి చేయండి.. కానీ పేదల విద్యాభివృద్ధి చేసే కృషికి అడ్డుపడకండి' అని అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. ఇదే వ్యవహారంలో అతని సోదరుడు కూడా స్పందించారు.

'కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా.. నెక్లెస్‌రోడ్‌ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది. నెక్లెస్‌ రోడ్‌ను కూడా తొలగిస్తారా.. జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేది. మరి జీహెచ్‌ఎంసీ కార్యాలయం పరిస్థితేంటి' అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.

నేను సమర్థిస్తున్నా..

'ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతను సమర్థిస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి బుస కొట్టింది. తర్వాత సైలెంట్‌ అయ్యింది. అక్రమ కట్టడాలను సీఎం రేవంత్‌ కూల్చేయించడం మంచిదే. నాగార్జున మంచి నటుడు కావొచ్చు.. కానీ కక్కుర్తి ఎందుకు.? సినిమా డైలాగ్‌లు కొట్టడం కాదు.. బుకాయింపు మాటలు వద్దు' అని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.

శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని..

'చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తాం. శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని.. ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నాం. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతాం. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. ఫాంహౌస్‌ల డ్రైనేజీ కాల్వను గండిపేటలో కలిపారు. మీ విలాసం కోసం వ్యర్థాలను చెరువులో కలుపుతారా.. అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా కబ్జాదారులను వదలం. ప్రకృతిసంపద విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది.. చెన్నై, వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపాన్ని చూశాం. భవిష్యత్ తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలి' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.