MIM Asaduddin: వరుసగా ఐదోసారి ఎంపీగా గెలిచిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్ధిపై భారీ విజయం
MIM Asaduddin: హైదరాబాద్ గడ్డపై వరుసగా ఐదోసారి అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం జెండా ఎగురవేశారు. సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాధవిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు.
MIM Asaduddin: ఏంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి తమ కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత పై దాదాపు 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో అయన గెలుపొందారు.
గతంతో పోల్చితే హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఈసారి బీజేపీ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ ప్రజలు మరోసారి మజ్లిస్ పార్టీకే పట్టం కట్టారు. బిఆర్ఎస్,కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నా
మజ్లిస్ పార్టీకి మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. అందుకు కారణం ఆ పార్టీ అభ్యర్థి మాధవీలత. బీజేపీ టికెట్ ప్రకటించినప్పటి నుంచి తనదైన శైలిలో అందరికంటే ముందుగానే ప్రచారంలోకి దిగిన మాధవీలత......కొంతవరకూ హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఉన్న ప్రజలను ఆకట్టుకోగలినప్పటికీ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలకపోయింది.
ప్రభావం చూపని కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులు
హైదరాబాద్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న వలియుల్ల సమీర్, బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయేరు. అసదుద్దీన్ ఒవైసీ కి మొత్తం 6,61,981 ఓట్లు రాగా.....రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి మాధవీలత 3,23,894 ఓట్లు సాధించారు. ఇక మూడో స్థానంలో ఉన్న వలీయుల్ల సమీర్ కు 62,962 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇక చివరి స్థానానికి పరిమితం అయిన బిఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కేవలం 18 వేల ఓట్లు పొంది డిపాజిట్లు కోల్పోయారు.2019 పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి 58.4% పోలింగ్ నమోదు అవ్వగా ఈసారి 61.28% ఓట్లు పోలయ్యాయి.పాతబస్తీలో మజ్లిస్ ప్రధాన ప్రత్యర్థి ఎంబిటీ పోటీలో లేకపోవడంతో మజ్లిస్ సునాయసంగా భారీ మెజారిటీతో విజయం సాధించింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
1984 నుంచి మజ్లిస్ కంచుకోటగా హైదరాబాద్
హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం 1951 లో ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా.....1984 నుంచి ఇక్కడ ఏంఐఎం గెలుస్తూ వస్తుంది. హైదరాబాద్ లోక్ సభ పరిధిలో మలక్ పేట్, కార్వన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట,యాకుత్ పురా, బహదూర్ పురా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
అసదుద్దీన్ ఒవైసీ 1994 నుంచి 2004 వరకు చార్మినార్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తరవాత 2004 ఎన్నికల్లో పోటీ చేసి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక తరువాత 2009,2014,2019 ఎన్నికల్లో వరుసగా ఎంపిగా గెలవడంతో హైదరాబాద్ అసదుద్దీన్ కు కంచుకోటగా మారింది. తాజాగా హైదరాబాద్ నుంచి మరోసారి ఎంపిగా విజయం సాధించడం గమనార్హం.
హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓడించే లక్ష్యంతో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించినా ఎంఐఎంను ఓడించలేకపోయారు. మరోవైపు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి తరపున ప్రచారం నిర్వహించిన మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా కూడా ఓటమి పాలయ్యారు. మహారాష్ట్రలోని అమ్రావతి నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఒవైసీ సోదరులపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కలిసి రాలేదు.
(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)
సంబంధిత కథనం