Hyderabad: దుర్గం చెరువు ఆక్రమణలు.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూల్చివేత నోటీసులు!-demolition notices for cm revanth reddy brother house in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad: దుర్గం చెరువు ఆక్రమణలు.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూల్చివేత నోటీసులు!

Hyderabad: దుర్గం చెరువు ఆక్రమణలు.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూల్చివేత నోటీసులు!

Basani Shiva Kumar HT Telugu
Aug 29, 2024 10:34 AM IST

Hyderabad: చెరువు భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమణలకు పాల్పడ్డవారు ఎంతటి వారైనా వదలడం లేదు. తాజాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూడా కూల్చివేత నోటీసులు అంటించారు. ఈ ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది.

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూల్చివేత నోటీసులు
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూల్చివేత నోటీసులు (Image source: twitter)

హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. వాటిపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు.. ఎనుముల తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయంతో సహా పలు ప్రముఖ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని 30 రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు.

మీరే కూల్చుకొండి.. లేదంటే అధికారులు వస్తారు..

రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద ఈ నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని నిర్ణీత గడువులోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు. లేదంటే అధికారులే కూల్చివేతలు చేపడతారని హెచ్చరించారుయ

100 ఎకరాలు ఉండే దుర్గం చెరువు..

ఆక్రమణల కారణంగా దుర్గం విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. ఈ చెరువు 100 ఎకరాల్లో ఉండేది. ఇటీవలి కొలతల ప్రకారం 84 ఎకరాలు మాత్రమే ఉంది. దశాబ్దం కింద ఈ ఏరియాను నాన్-డెవలప్‌మెంట్ జోన్ (ఎన్‌డిజెడ్)గా గుర్తించారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో చెరువు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది.

ఎంతో మంది వీఐపీలు..

రాజకీయ నాయకులు, ఇంజినీర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లు, ఎంతోమంది ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ చెరువు చుట్టూ.. ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో చాలామందికి అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఆ ఆక్రమణలను తొలగిస్తే.. కబ్జాకు గురైన దుర్గం చెరువుకు పునర్వైభవం వస్తుందని స్థానికులు చెబుతున్నారు.