Chiranjeevi: అభిమానిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. అండగా ఉంటామని హామీ-chiranjeevi facilitate his fan eshwarayya who went tirumala tirupati temple with rolling like sashtanga namaskaram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: అభిమానిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. అండగా ఉంటామని హామీ

Chiranjeevi: అభిమానిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. అండగా ఉంటామని హామీ

Sanjiv Kumar HT Telugu
Aug 27, 2024 10:23 AM IST

Chiranjeevi Facilitate His Fan Eshwarayya: మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని ఈశ్వరయ్యను సత్కరించారు. ఆయన్ను, అతని కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకుని మరి ఘన సన్మానం చేశారు. అలాగే ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అభిమానిని చిరంజీవి ఎందుకు సత్కరించారనే వివరాల్లోకి వెళితే..

అభిమానిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. అండగా ఉంటామని హామీ
అభిమానిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. అండగా ఉంటామని హామీ

Megastar Chiranjeevi Fan Eshwarayya: మెగాస్టార్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను ఎంతలా ప్రశంసిస్తారో తన అభిమానులను కూడా ఎంతో ప్రేమించడంతోపాటు మర్యాదగా చూసుకుంటారు చిరంజీవి. ఇందుకు నిదర్శనం తాజాగా జరిగిన సన్మానమే.

ప్రత్యేకంగా పిలుచుకుని

ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు అన్న విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య అనే చిరంజీవి అభిమాని తిరుప‌తి నుంచి తిరుమ‌ల కొండ వ‌ర‌కు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విష‌యం తెలియ‌గానే ఈశ్వ‌రయ్య, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు చిరంజీవి.

ఈశ్వరయ్య కుటుంబానికి పట్టు బ‌ట్ట‌లు పెట్టి స‌త్క‌రించటం ప్రస్తుతం విశేషంగా మారింది. అలాగే ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని మెగాస్టార్ హామీ ఇచ్చారు. సోమవారం (ఆగస్ట్ 26) రోజున చిరంజీవి అయ్య‌ప్ప మాల‌ను ధరించారు. ప్ర‌తీ ఏడాది అయ్య‌ప్ప మాల‌ను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాల‌ను ధ‌రించారు.

అండగా నిలుస్తూ

మాల‌ధార‌ణ‌లోనూ ఈశ్వ‌ర‌య్య కుటుంబంతో చిరంజీవి క‌లిసి మాట్లాడారు. సాధార‌ణంగా చిరంజీవి త‌న హార్డ్ కోర్ అభిమానుల‌కు ఎప్పుడూ అండ‌గా నిలుస్తుంటారు. చాలా సంద‌ర్భాల్లో ఇది నిరూప‌ణ అయింది. ఇప్పుడు ఈశ్వ‌ర‌య్య గురించి తెలియ‌గానే మ‌రోసారి మెగాస్టార్ ఆయ‌న్ని ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు.

గతంలో ఈశ్వ‌ర‌య్య తిరుప‌తి నుంచి మెగాస్టార్ ఇంటి వ‌ర‌కు సైకిల్ యాత్ర‌ను నిర్వ‌హించారు. అదే విధంగా ప‌వ‌న్ కల్యాణ్ పుట్టిన‌రోజుకు, జనసేన పార్టీ నెగ్గాల‌ని ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేయ‌టం విశేషం. ప్రస్తుతం ఈ విషయం, దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బర్త్ డే విషెస్

ఇదిలా ఉంటే, చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా విశ్వంభర నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. "చీకట్లో, దుష్ట శక్తుల గుప్పిట్లోకి ప్రపంచం ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడో ప్రకాశవంతమైన నక్షత్రం వాటితో యుద్ధం చేసేందుకు మరింత ప్రకాశంగా మెరుస్తుంది" అని రాసుకొస్తూ చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేశారు.

ఈ ఫస్ట్ లుక్‌లో చిరంజీవి చేతిలో మెరుస్తున్న త్రిశూలం ఉంది. అది ఉరుములు మెరుపులతో స్టన్నింగ్‌గా ఉంది. ఇక దాన్ని పట్టుకుని ఉన్న చిరంజీవి లుక్ అదిరిపోయింది. కాగా విశ్వంభర మూవీని బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు.

మరోసారి చిరంజీవితో

విశ్వంభర సినిమాతో బ్యూటిఫుల్ హీరోయిన్ త్రిష మరోసారి చిరంజీవితో జోడీ కట్టనుంది. ఇదివరకు వీరిద్దరు స్టాలిన్ సినిమా చేసిన విషయం తెలిసిందే. కాగా విశ్వంభర సినిమాలో చిరంజీవి, త్రిషతోపాటు నా సామిరంగ హీరోయిన్ ఆషికా రంగనాథ్, బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. అంటే మరోసారి చిరంజీవి సంక్రాతి బరిలో పోటీకి దిగనున్నారు. ఇదివరకు వాల్తేరు వీరయ్య మూవీతో సంక్రాంతి పోటీలో నిలిచి మంచి విజయం సాధించారు.