Shankar Dada MBBS: 4కే వెర్షన్‌లో చిరంజీవి బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్.. ఏరోజు అంటే?
Chiranjeevi Shankar Dada MBBS Re Release: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కామెడీ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ కానుంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో మరోసారి విడుదల చేయనున్నారు.
Shankar Dada MBBS Re Release: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చారు. వాటిలో అనేక చిత్రాలు మైల్ స్టోన్‌గా నిలిచిపోవడమే కాకుండా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. యాక్షన్ నుంచి కామెడీ వరకు ఎన్నో మూవీస్‌లో తనదైన స్టైల్‌లో మేనరిజంతో అదరగొట్టారు చిరంజీవి.
అలాంటి చిరంజీవి కెరీర్‌లోనే కామెడీ మూవీగా వచ్చి రికార్డులు బద్దలుగొట్టింది శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా చూస్తున్న విషయం తెలిసిందే. అలా టాలీవుడ్ ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఒకటిగా ఎదురు చూస్తున్న రీ రిలీజ్‌ల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా కూడా ఒకటి.
తెలుగులో రీమేక్‌గా
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కామెడీ అండ్ ఎమోషనల్ చిత్రంగా 2004లో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సాధించింది. బాలీవుడ్ మూవీ మున్నా భాయ్ ఎంబీబీఎస్‌కు ఈ సినిమా రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ జయంత్ పరాన్జీ తెరకెక్కించారు.
ఇందులో చిరంజీవి సరసన సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించింది. ఇక మూవీలో శంకర్ దాదాగా చిరంజీవి, ఏటీఎంగా శ్రీకాంత్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో చిరంజీవి ఇంగ్లీష్ పదాలతో తెలుగు సామేతులు చెబుతుంటే థియేటర్స్‌లో ఆడియన్స్ అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. అలాగే లైఫ్ జర్నీలో మనిషి ఎదుర్కొనే అనేక ఎమోషన్స్‌ని అందరి మనసుని హత్తుకునేలా చూపించారు.
4కే వెర్షన్‍లో రీ రిలీజ్
ఇక ఈ సినిమాకి మరో హైలైట్ అంటే.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్. ఈ రీ రిలీజ్‌తో థియేటర్స్ అన్ని మ్యూజికల్ కాన్సర్ట్‌గా, కామెడీ కార్నివాల్‌గా మారిపోనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం థియేటర్స్‌లో రీ రిలీజ్ కానుంది. అది కూడా 4కే వెర్షన్‍లో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు.
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలను 4కే వెర్షన్‌తో మరింత క్లారిటీగా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్‌ను 4కే క్లారిటీతో మళ్లీ విడుదల చేయనున్నారు. భారీగా అత్యంత ఎక్కువ థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నారు. జేఆర్‌కే పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తోంది.
జనాల నవ్వులతో
కాగా ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ వస్తే ఇప్పటికీ టీవీల్లో హుషారెత్తిపోతుంటారు జనాలు. చిరంజీవి కామెడీ స్టైల్‌కు ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుతుంటారు. ఇందులో ఎఎస్ నారాయణ, అలీ, వేణు, ఇతర నటీనటులతో చిరంజీవి, శ్రీకాంత్ చేసిన కామెడీ థియేటర్లలో జనాల నవ్వులతో హొరెత్తించింది.
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో పరేష్ రావల్, గిరీష్ కర్నాడ్, ఎంఎస్ నారాయణ, వేణు మాధవ్, ఆహుతి ప్రసాద్, అలీ, హీరో రోహిత్, సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్, వల్చర్ ఈటింగ్ హండ్రెడ్ బఫ్ఫల్లోస్ వన్ సైక్లోన్ ఫినిష్ వంటి డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి.