Telangana Chief Secretary : తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి-cm kcr appoints shanti kumari as telangana chief secretary becomes first women cs in state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Chief Secretary : తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి

Telangana Chief Secretary : తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి

HT Telugu Desk HT Telugu
Jan 11, 2023 04:01 PM IST

Telangana Chief Secretary : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు. సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే అని డీఓపీటీ ఆదేశించిన నేపథ్యంలో... రాష్ట్రానికి కొత్త సీఎస్ గా శాంతి కుమారిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ సీఎస్ గా శాంతికుమారి
తెలంగాణ సీఎస్ గా శాంతికుమారి

Telangana Chief Secretary : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (Chief Secretary) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనకు సిఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసిఆర్ గారిని కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సీఎస్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం.. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి గా శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు.ఆమె పదవీకాలం 2025, ఏప్రిల్ వరకు ఉంది.

ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో శాంతికుమారి మెదక్ కలెక్టర్‌గా పనిచేశారు. సీఎంఓలో స్పెషల్ ఛేజింగ్ సెల్ బాధ్యతలనూ నిర్వర్తించారు. సోమేశ్ కుమార్ స్థానంలో కొత్త సీఎస్ గా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు... పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే... కేసీఆర్ మాత్రం 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శాంతి కుమారిని ఎంపిక చేశారు. ఆమె సర్వీస్ కాలం ఇంకా రెండున్నరేళ్లు ఉన్నందున... సీఎస్ గా నియమిస్తే సుదీర్ఘకాలం పనిచేసే అవకాశాలుంటాయని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

మరోవైపు... ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్ కుమార్ జనవరి 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు. డీఓపీటీ ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లనున్నారు. సోమేశ్ ఏపీ క్యాడర్ కి వెళ్లాల్సిందే అని మంగళవారం రోజు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వగా.. వెంటనే స్పందించిన డీఓపీటీ సోమేశ్ ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. డీఓపీటీ ఆర్డర్స్ కి అనుగుణంగా జనవరి 12న సోమేశ్ కుమార్ ఏపీకి రిపోర్ట్ చేయనున్నారు. కాగా.. ఈ ఏడాది డిసెంబర్ 30తో ఆయన సర్వీసు కాలం ముగియనుంది.