AP TG Weather Updates : వాయుగుండంగా మారనున్న అల్పపీడనం - 4 రోజులు అతి భారీ వర్షాలు..! IMD ‘ఆరెంజ్’ హెచ్చరికలు-low pressure in bay of bengal is likely to turn into a cyclone within 36 hours imd latest weather updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Weather Updates : వాయుగుండంగా మారనున్న అల్పపీడనం - 4 రోజులు అతి భారీ వర్షాలు..! Imd ‘ఆరెంజ్’ హెచ్చరికలు

AP TG Weather Updates : వాయుగుండంగా మారనున్న అల్పపీడనం - 4 రోజులు అతి భారీ వర్షాలు..! IMD ‘ఆరెంజ్’ హెచ్చరికలు

ఏపీ, తెలంగాణకు ఐఎండీ భారీ వర్ష సూచన ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నాని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఏపీకి భారీ వర్ష సూచన (Image Source @APSDMA Twitter)

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై వాతావరణశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. రాగల 36 గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా ఉత్తరాంధ్ర,దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

 కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించింది.  రేపు (ఆగస్టు 31)  శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని… ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

అతి భారీ వర్షాలు..!

ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు (ఆగస్టు 31) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 

సెప్టెంబర్ 1వ తేదీన చూస్తే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

తెలంగాణలో సెప్టెంబర్ 4వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని ఐఎండీ వివరించింది.  హైదరాబాద్ నగరంలో చూస్తే మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. వాయువ్య దిశలో ఉపరితలగాలులు వీస్తాయని పేర్కొంది.