AP Weather Updates: నేడు ఏపీలో పిడుగులతో కూడిన వానలు, అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ శాఖ
AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ వర్షాలతో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడా వర్షాలు పడుతాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
AP Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
నైరుతి రుతుపవనాలు బుధవారం తెలంగాణ మొత్తం, ఛత్తీస్‌గఢ్‌లలో పలు ప్రాంతాలకు విస్తరించాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయి. రుతుపవనాలు మెల్లగా కదులుతూ ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు, పడమర మధ్య ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో బుధవారం వర్షాలు కురిశాయి.
కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఎండ తీ వ్రత, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. గాలిలో తేమశాతంతో పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన ఉక్కపోత అనుభవిస్తున్నారు. మచిలీపట్నంలో బుధవారం 37.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
గురువారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండటంతో గురువారం మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండి హెచ్చరికలు జారిచ చేసింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం విజయనగరం, మన్యం, అల్లూరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్‌డిఎంఏ తెలిపింది.
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఉందని తెలిపారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.