Vijayawada Record Rainfall: విజయవాడలో 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది.. ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం
Vijayawada Record Rainfall: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఏపీకి గండంగా మారింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో వర్షాపాతం నమోదైంది. దీంతో నగరాలు, పట్టణాలు, పల్లెలు నిటిలో నానుతున్నాయి. భారీ ఆస్తి నష్టం వాటిళ్లింది. దీంతో ఏపీ గజగజ వణికిపోతోంది.
విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఒకేరోజు 29 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుంచి విజయవాడలో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది. ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు వర్షపు నీరు నిలిచి ఉంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం కూడా బెజవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెజవాడ గజగజ వణికిపోతోంది.
చిగురుటాకుల్లా వణికిపోతున్న పల్లెలు..
కేవలం విజయవాడ నగరమే కాదు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పల్లెలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఏలూరు నగరంలోని అనేక కాలనీలు నీట మునిగాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. ఇక విజయవాడ, గుంటూరు నగరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ చూసినా నాలుగైదు అడుగుల మేర నీరు నిలిచింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో అనేక కాలనీలు వర్షపు నీటిలోనే నానుతున్నాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరి.. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది.
శిథిలాల తొలగింపు..
విజయవాడలోని మొఘల్రాజపురం వద్ద విరిగిన కొండచరియల వద్ద శిథిలాలను అధికారులు తొలగిస్తున్నారు. శిథిలాల తొలగింపునకు ప్రభుత్వం భారీ క్రేన్లను తెప్పిస్తున్నారు. పడిపోయిన కొండరాళ్లను డ్రిల్లింగ్ చేసి.. శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. శనివారం కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. కొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది.
ముగ్గురు గల్లంతు..
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో విషాదం జరిగింది. భారీ వర్షం, వరదలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఉప్పలపాడు- గోళ్లమూడి మధ్య వరద ఉధృతికి కారు కాల్వలో కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మృతులు ఎన్ రాఘవేంద్ర, పసుపులేటి సందీప్, కోడూరి మాన్విత్‌గా గుర్తించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు.
రైళ్లు రద్దు..
భారీ వర్షాల నేపథ్యంలో.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దయ్యాయి. వర్షాల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. కాజీపేట- విజయవాడ మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలో వరద ధాటికి ట్రాక్ దెబ్బతింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు వందలాది బస్సులు వరద నీటిలో నానుతూనే ఉన్నాయి. విజయవాడ బస్టాండ్ సమీపంలో రైల్వే ట్రాక్ కింద బస్సులు నీటిలో చిక్కుకున్నాయి.