Rains in Telangana Live : అక్కడ హెలీకాప్టర్లు సిద్ధంగా ఉంచండి - సీఎం కేసీఆర్-telangana floods people evacuated to relief camps live updates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rains In Telangana Live : అక్కడ హెలీకాప్టర్లు సిద్ధంగా ఉంచండి - సీఎం కేసీఆర్

వరద ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెల్లవారు ఘామునుండే విస్తృతంగా పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసి తక్షణమే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు.

Rains in Telangana Live : అక్కడ హెలీకాప్టర్లు సిద్ధంగా ఉంచండి - సీఎం కేసీఆర్

04:27 AM ISTJul 17, 2022 01:44 PM HT Telugu Desk
  • Share on Facebook
04:27 AM IST

  • Rains in telangana Live: తెలంగాణలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు వరదల కారణంగా ముంపు ముప్పు ఎదుర్కొంటున్నాయి.

Sun, 17 Jul 202203:16 PM IST

హెలీకాప్టర్లు సిద్ధంగా ఉంచండి - సీఎం కేసీఆర్

ఏటూరు నాగారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నెలాఖరు వరకూ భారీ వర్షాలుంటాయన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంత పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ప్రతి శాఖ అధికారులు మూడు షిఫ్టులుగా పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సీఎం అన్నారు.

గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని, కానీ, ఇపుడు ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్ ను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరదతో చాలా చోట్ల మిషన్ భగీరథ పైపులు దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ములుగు జిల్లాకేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరినందున దీన్ని వెంటనే మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

వరద ప్రభావిత జిల్లాలకు నిధులు :

వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సహాయం కింద ప్రత్యేకంగా నిధులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాకు రూ.2 కోట్ల 50 లక్షలు, భద్రాచలం జిల్లాకు రూ.2 కోట్ల 30 లక్షలు, భూపాలపల్లి జిల్లాకు రూ.2 కోట్లు, మహబూబాబాద్ కు రూ. 1 కోటి 50 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం తెలిపారు.

రెండు హెలీకాప్టర్లు సిద్ధంగా ఉంచాలి :

వర్షాలతో వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగు జిల్లా కేంద్రంలో ఒక హెలీకాప్టర్ ను, భద్రాచలంలో మరొక హెలీకాప్టర్ ను సిద్ధంగా ఉంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్ వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. కరంటు సౌకర్యాన్ని కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. పక్కాపూర్ గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నాం. శ్యాంపల్లి ఆర్ అండ్ బీ రోడ్డు పనులను సత్వరమే చేపట్టాలని, వరద ప్రాంతాల్లో పనులు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిధులు ఎక్కువ ఖర్చయినా సరే.. నాణ్యమైన పనులు చేపట్టాలని సూచించారు. ఏజెన్సీ ఏరియాలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే పారిశుధ్య పనులను చేపట్టాలని ఆదేశించారు.

‘‘ మనందరం ప్రజల కోసమే పనిచేయాలి. ఏ ఒక్కరినీ ఏమీ అనవద్దు. అటవీశాఖ అధికారులు పనుల ఇబ్బందుల పేరు మీద ఏమాత్రం ఇబ్బంది పెట్టవద్దు.’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాగా, ఏటూరునాగారంలో డయాలసిస్ సెంటర్ ను వెంటనే ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.

Sun, 17 Jul 202209:12 AM IST

సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే…

భద్రాచలం పర్యటన అనంతరం, భద్రాచలం నుండి ఏటూరు నాగారం దిశగా, ముఖ్యమంత్రి కేసీఆర్ హెలీకాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని సీఎం పరిశీలించారు. నదికి ఇరువైపులా నీటిలో చిక్కుకున్న గ్రామాల్లో వరదల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ, సీఎం ఏటూరు నాగారం చేరుకున్నారు. కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన ముంపు బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లి, ముంపు బాధితులను సీఎం పరామర్శిస్తారు. 

Sun, 17 Jul 202208:18 AM IST

వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళి సై పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​ పర్యటించారు. అశ్వాపురం మండలం బట్టీల గుంపు వద్ద బాధితులతో మాట్లాడారు. ఆ ప్రాంతానికి చెందిన సర్పంచ్‌లు తమ సమస్యలపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం అశ్వాపురంలోని వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని తమిళిసై సందర్శించారు. ముంపు బాధితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

Sun, 17 Jul 202208:18 AM IST

బాధితుల ఆందోళన

సీఎంను కలవనివ్వలేదంటూ పునరావాస శిబిరం వద్ద ఆందోళన చేశారు బాధితులు. అశ్వాపురం మండలం మొండికుంట పునరావాస శిబిరం వద్ద ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వలేదంటూ నిర్వాసితుల ఆందోళన వ్యక్తం చేశారు. పునరావాస శిబిరానికి సీఎం వస్తారని అధికారులు తెలిపారు. కేసీఆర్‌కు గోడు చెప్పుకోవాలని భావించిన బాధితులు.. సీఎం రాలేదని ఆందోళన చేశారు. పునరావాస కేంద్రాన్ని ఖాళీ చేసిన వరద బాధితులు.. శిబిరం నుంచి 10 కి.మీ దూరంలోని స్వగ్రామానికి వెళ్తున్నారు.

Sun, 17 Jul 202208:18 AM IST

భద్రాచలం నుంచి హెలికాప్టర్‌లో ఏటూరునాగారం బయలుదేరిన కేసీఆర్

భద్రాచలం నుంచి హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ ఏటూరునాగారం బయలుదేరారు. భద్రాచలం నుంచి హెలికాప్టర్‌లో వెళ్లారు. వరద ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ విహంగ వీక్షణం చేస్తారు.

Sun, 17 Jul 202207:35 AM IST

క్లౌడ్‌ బరస్ట్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

క్లౌడ్‌ బరస్ట్‌పై సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్‌ బరస్ట్‌ అనే కొత్త పద్ధతి వచ్చిందన్నారు. క్లౌడ్‌ బరస్ట్‌పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని, కుట్రలు ఎంతవరకు నిజమో తెలియదన్నారు. ఇతర దేశాలవాళ్లు కావాలని అక్కడక్కడ క్లౌడ్‌ బరస్ట్ చేస్తున్నారన్నారు. గతంలో లద్దాఖ్‌, లేహ్‌, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ చేశారని, గోదావరి పరివాహక ప్రాంతంపై క్లౌడ్‌ బరస్ట్‌ చేస్తున్నట్లు సమాచారమన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పాతాలు వస్తుంటాయన్నారు.

'భద్రాచలం ఆలయ అభివృద్ధికి కృషిచేస్తా. ఆలయ అభివృద్ధిపై తదుపరి పర్యటనలో పర్యవేక్షిస్తా. నెలాఖరు వరకు భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి. వరద బాధితులకు పునరావాస కేంద్రాలు కొనసాగించాలి. వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. గోదావరికి ముప్పు తప్పేలా చర్యలు చేపడతాం.' అని సీఎం కేసీఆర్ అన్నారు.

Sun, 17 Jul 202206:14 AM IST

గోదావరి నదికి సీఎం కేసీఆర్ శాంతి పూజ

సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి పర్యవేక్షించారు. గోదావరి నదికి ముఖ్యమంత్రి శాంతి పూజ నిర్వహించారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలిస్తారు. అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్తారు. వరద బాధితులను పరామర్శిస్తారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకుంటారు.

Sun, 17 Jul 202202:35 AM IST

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్​ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్​ ఏరియల్​ సర్వే చేయనున్నారు. ఇప్పటికే.. హనుమకొండ నుంచి ఏటూరునాగారం బయలుదేరారు. హనుమకొండ నుంచి రోడ్డుమార్గాన బయలుదేరారు సీఎం. హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేయాల్సి ఉన్నా.. ప్రతికూల వాతావరణంతో రోడ్డుమార్గాన వెళ్లారు.

Sat, 16 Jul 202212:19 PM IST

హన్మకొండకు బయల్దేరిన సీఎం కేసీఆర్

రోడ్డు మార్గన ప్రత్యేక బస్సులో హన్మకొండకు బయల్దేరిన సీఎం కేసీఆర్

రేపు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే

 

Sat, 16 Jul 202212:13 PM IST

శాంతించిన గోదారమ్మ

 గోదారమ్మ క్రమంగా శాంతిస్తోంది. నిన్న సాయంత్రం భద్రాచలం వద్ద 70.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం... ఈరోజు సాయంత్రానికి 69.4 అడుగుల వద్ద కొనసాగుతోంది. వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నదీ తీర ప్రాంత గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. 

Sat, 16 Jul 202210:15 AM IST

తగ్గిన నీటిమట్టం…

భద్రాచలం వద్ద ప్రస్తుతం 69.78 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.

నిలకడగా ఉన్న నీటిమట్టం

Sat, 16 Jul 202210:14 AM IST

కాసేపట్లో వరంగల్ కు కేసీఆర్..

కాసేపట్లో రోడ్డు మార్గంలో హన్మకొండకు బయలుదేరనున్న సీఎం కేసీఆర్.

రాత్రికి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస

సాయంత్రం జిల్లా నేతలతో భేటీ

రేపు ఉదయం ఆర్ట్స్ కాలేజ్ నుండి హెలీకాప్టర్ ద్వారా గోదావరి తీరంలో వరద పరిస్థితిని పరిశీలించనున్న కేసీఆర్.

Sat, 16 Jul 202208:33 AM IST

కరకట్టను పొడిగించాలి

కరకట్ట పొడిగింపుపై హామీ ఇవ్వాలని బాధితులు డిమాండ్‌  చేశారు. రోడ్డుపై బైఠాయించి సుభాష్‌ నగర్‌ వరకు కరకట్టను పొడగించాలని నినాదాలు చేశారు. వరదల్లో చిక్కుకున్న తమకు తాగేందుకు నీరు కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని కన్నీంటిపర్యంతమయ్యారు. 

Sat, 16 Jul 202208:21 AM IST

వరద ముంపు ప్రాంతాలకు కేసీఆర్.. స్వయంగా అడిగి

ఏరియల్ సర్వే సందర్భంగా సిఎం కేసీఆర్ వరద ముంపు ప్రాంతాల్లో దిగి అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించే అవకాశమున్నది. ప్రకృతి విపత్తు వరదల వల్ల ప్రజలకు జరిగిన కష్ట నష్టాలను సిఎం ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. అవసరమైన మేరకు సహాయాన్ని ప్రకటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. అధికారులు నిర్దేషించిన ప్రాంతాల్లో ఉండి మంత్రులు ప్రజాప్రతినిధులు కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించనున్నట్టు తెలిసింది. వరదల అనంతర పరిస్థితులను అంచనావేసి విద్యుత్తు రోడ్లు తాగునీరు పంటలు తదితర రంగాల్లో జరిగిన నష్టాలను అంచనావేసి సహాయక చర్యల కోసం చర్యలు చేపట్టే అవకాశమున్నది. వరదల్లో అంటువ్యాధులు సోకకుండా అందే వైద్యసాయం గురించి ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖకు సిఎం కెసిఆర్ పలు సూచనలు చేసే అవకాశమున్నదనీ విశ్వసనీయ వర్గాల సమాచారం.

Sat, 16 Jul 202206:13 AM IST

70.70 అడుగులుగా నీటిమట్టం

గోదావరి వద్ద ప్రస్తుతం నీటి మట్టం  70.70 అడుగులుగా ఉంది. 24,13,509 క్యూసెక్ లు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

 

Sat, 16 Jul 202206:00 AM IST

శాంతిస్తోంది….!

భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా ఉంది. 70.90 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 71.30 అడుగుల నుంచి 70.90 నీటిమట్టం అడుగులకు తగ్గింది. ఎగువ నుంచి వరద తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తోంది.

Sat, 16 Jul 202205:57 AM IST

రేపు భద్రాచలానికి గవర్నర్

రేపు భద్రాచలానికి గవర్నర్ తమిళిసై వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.

Sat, 16 Jul 202204:57 AM IST

సీఎం ఏరియల్ సర్వే

రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

కడెం నుంచి భద్రాచలం వరకు సర్వే

Sat, 16 Jul 202204:02 AM IST

నాగార్జునసాగర్‌కు ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

నాగార్జునసాగర్‌కు ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ ఇన్ ఫ్లో 12,714 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 7,987 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 529.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 166.7838 టీఎంసీలకు చేరింది.

Sat, 16 Jul 202203:58 AM IST

జూరాల ప్రాజెక్టు వరద అప్ డేట్స్

జూరాల ప్రాజెక్టు వరద అప్ డేట్స్

23 గేట్లు ఎత్తివేత

పూర్తిస్థాయి నీటిమట్టం: 318.516 M

ప్రస్తుత నీటిమట్టం: 317.540 M

పూర్తి నీటి సామర్థ్యం: 9.657 TMC

ప్రస్తుత నీటి నిల్వ: 7.721 TMC

ప్రస్తుత వరద In Flow: 1,45,000 క్యూసెక్కులు.

దిగువకు నీటి విడుదల:- 1,38,032 క్యూసెక్స్

పూర్తి ఔట్ ఫ్లో: 1,40,088 కూసెక్కులు.

Sat, 16 Jul 202203:30 AM IST

తగ్గు ముఖం పడుతున్న గోదావరి నది

కాళేశ్వరం వద్ద 13.570 మీటర్లతో ప్రవహిస్తు క్రమంగా తగ్గు ముఖం పడుతున్న గోదావరి నది

లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 16,71,388 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల.

ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 16,71,388 క్యూసెక్కులు

లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు

సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 4,58,489 క్యూసెక్కులు దిగువకు విడుదల.

ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 4,58,489 క్యూసెక్కులు

సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు

ప్రస్తుత నీటి సామర్ధ్యం 1.32 టిఎంసిలు

Fri, 15 Jul 202203:25 PM IST

ప్రమాద స్థాయిలో గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద ప్రమాద స్థాయిలో గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద 70.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

గోదావరిలోకి 24.18 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం

భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

Fri, 15 Jul 202211:12 AM IST

70 అడుగులకు వరద…

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 36 ఏళ్ల తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో 70 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. మరోవైపు ఆర్మీ బృందాలు కూడా భదాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకోనున్నాయి.

Fri, 15 Jul 202208:31 AM IST

సహాయ, పునరావాస చర్యలకు 101 సభ్యుల సైనిక బృందం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు గాను భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పునరావాస చర్యల లలో పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరగా 68 మంది సభ్యులు గల సైనిక బృందం, 10 మంది సభ్యులు గల వైద్య బృందం, 23 మంది సభ్యులు గల ఇంజనీరింగ్ బృందం సహాయ చర్యల్లో పాల్గొనేందుకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు వస్తున్నాయని వెల్లడించారు.

Fri, 15 Jul 202208:28 AM IST

భద్రాచలం బయలుదేరుతున్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్ష నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు గారు మరికొద్ది సేపట్లో ఖమ్మంలోని ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయం నుంచి భద్రాచలంలో గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి బయలుదేరుతున్నారు. గోదావరి వరద జలాలతో నిండిపోయిన భద్రాద్రి రామాలయం, పరిసర ప్రాంతాలు, కరకట్ట మీదుగా గోదావరి బ్రిడ్జి, కూనవరం రోడ్డు, భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, భద్రాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మూసివేసిన రోడ్లు, వరద తీవ్రతను పరిశీలిస్తారు. భద్రాచలంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావసకేంద్రాన్ని సందర్శించి వరద బాధితులను పరామర్శిస్తారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యల గురించి ఆరా తీసి వారి సమస్యలు తెలుసుకొని, అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఉన్నత అధికారులకు ఫోన్ చేసి వారి సమస్యలను వివరించనున్నారు. అదేవిధంగా అకాల వర్షాలతో అతలాకుతలమైన అన్నదాతల పంట పొలాలను కూడా పరిశీలిస్తారు.

Fri, 15 Jul 202207:58 AM IST

పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలం ప్రాంతాలకు ముప్పు?

పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలం ప్రాంతాలకు ముంపు ముప్పు ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలవరం బ్యాక్ వాటర్ స్థాయిపై అధ్యయనం జరపాలని అభిప్రాయపడుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టులో పలుమార్లు వాదనలు కూడా జరిగాయి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 22 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని, 1986లో 26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినందున ఇప్పుడంత భయాందోళనలు అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Fri, 15 Jul 202207:38 AM IST

కాసేపట్లో 70 అడుగులకు వరద

భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం 70 అడుగులకు చేరనుంది. తీరప్రాంతంలో ఉన్న పలు మండలాల్లో బాధిత ప్రజలను సహాయ, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అనేక ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. స్థానికంగా సహాయ కార్యక్రమాలకు వీలుగా హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు గోదావరి శాంతించేందుకు తీరప్రాంతాల ప్రజలు పూజలు చేస్తున్నారు. ప్రవాహం 70 అడుగులకు చేరితే తీవ్ర నష్టం సంభవించే ప్రమాదం ఉంది. భద్రాచలం పట్టణంలోని అనేక కాలనీలు సహా పలు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది.

Fri, 15 Jul 202207:31 AM IST

ఎల్లంపల్లి వద్ద వరద ఉగ్రరూపం

ఎల్లంపల్లి వద్ద వరద తీవ్ర రూపం దాల్చింది. ఈ ఉదయం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 9,33,700 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో వచ్చింది. శ్రీరామ్ సాగర్‌లోకి 2,68,00 క్యూసెక్కుల వరద ప్రవహించింది.

Fri, 15 Jul 202205:46 AM IST

భధ్రాచలానికి హెలీకాఫ్టర్ , అదనపు రక్షణ సామగ్రి తరలించండి: సీఎం

• అనూహ్య వరదలతో జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆరెఫ్ సిబ్బందిని, రెస్కూ టీం‌లు సహా హెలీకాప్టర్లను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. భధ్రాచలంలో క్రేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. వరదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగ పడే లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

Fri, 15 Jul 202204:45 AM IST

ఎన్టీవీ రిపోర్టర్ జమీరుద్దునీ మృతి

వరదలలో చిక్కుకొని పోయిన వారికి సంబంధించిన వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన ఎన్టీవీ జగిత్యాల రిపోర్టర్ జమీరుద్దీన్ మృతి చెందాడు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత తిరిగి వస్తున్న సమయంలో రాయికల్ వద్ద వాగులో కారు‌తో సహా కొట్టుకొని పోయాడు. మూడు రోజుల ఆపరేషన్ తర్వాత ఈరోజు కార్ తోపాటు మృతదేహం లభ్యం అయింది.

Fri, 15 Jul 202204:30 AM IST

జూరాలకు భారీగా వరద

జూరాలకు భారీగా వరద రావడంతో అధికారులు 23 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.

Fri, 15 Jul 202204:29 AM IST

మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటీఆర్ ధన్యవాదాల

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు జూలై నెలలోనే కురుస్తున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో వరద వలన ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితుల్లో, ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో పార్టీ శ్రేణులన్నీ అండగా నిలుస్తున్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

ఇలాంటి కష్ట సమయంలో తమతమ నియోజకవర్గాల్లోనే ఉండి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పార్టీ నాయకులకి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

వీరి ప్రయత్నాలు వలన ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందుతున్నాయని, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల కార్యక్రమాలతో సమన్వయం చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు.

Fri, 15 Jul 202204:28 AM IST

మేడిగడ్డ కంట్రోల్ రూమ్‌లో చిక్కుకున్న అధికారులు

భూపాలపల్లి సమీపంలోని మేడిగడ్డ కంట్రోల్ రూమ్‌ను వరద చుట్టుముట్టడంతో అక్కడ పోలీసులు, ఇరిగేషన్ అధికారులు అక్కడే చిక్కుకుపోయారు. ఇక్కడ 90 మంది పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.

Fri, 15 Jul 202204:23 AM IST

జలదిగ్బంధంలో భద్రాచలం

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతం అతలాకుతలమమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదపోటు భద్రాచలంలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. గోదావరి తీరప్రాంతాలు వణికిపోతున్నాయి. పలువురు ముంపు బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇళ్ల వద్ద ఉన్న బాధితులు భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. జులై రెండో వారంలోనే ఈ స్థాయిలో వరదపోటెత్తడం గోదావరి చరిత్రలోనే ఇది రెండోసారి. భద్రాచలం వద్ద 1976లో జూన్ 22న తొలిసారి 63.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. 

Fri, 15 Jul 202204:06 AM IST

సరస్వతి బ్యారేజ్ నుంచి 11.68 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

వరద తాకిడితో అన్నారం సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 11,68,615 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 11,68,615 క్యూసెక్కులుగా ఉంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి సామర్ధ్యం 5.57 టీఎంసీలు.

Fri, 15 Jul 202204:06 AM IST

మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 28,67,650 క్యూసెక్కుల విడుదల

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 28,67,650 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 28,67,650 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసీలు.

Fri, 15 Jul 202204:06 AM IST

నీట మునిగిన కన్నెపల్లి పంప్ హౌజ్

కన్నెపల్లి పంప్ హౌస్‌లోకి వరద నీరు చేరడంతో 17 బాహుబలి మోటార్ల జలమయమయ్యాయి. బీర సాగర్ వద్ద నిర్మాణంలో ఉన్న చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పంప్ హౌస్‌లోకి కూడా వరద నీరు చేరింది.

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 28,67,650 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 28,67,650 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసీలు.

అన్నారం సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 11,68,615 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 11,68,615 క్యూసెక్కులుగా ఉంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి సామర్ధ్యం 5.57 టీఎంసీలు.

Fri, 15 Jul 202203:29 AM IST

Bhadrachalam river:  భద్రాచలం వద్ద వరద ఉధృతి

భద్రాచలం వద్ద ఈ ఉదయం 6 గంటలకు 66.70 ఫీట్ల ఎత్తులో నదీ ప్రవాహం కొనసాగుతోంది. 21,76,101 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. 53 ఫీట్ల ఎత్తులో ఉన్నప్పటి నుంచి మూడో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది.

Fri, 15 Jul 202203:26 AM IST

Rains in telangana: సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఖమ్మం జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం ప్రయత్నం చేస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముంపు ముప్పు ఉన్న ప్రాంతాలను సందర్శించి సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని కోరుతున్నారు. గోదావరి వరద ఉదృతి 68 అడుగులకు పెరిగిన దృష్ట్యా ఇంకా పెరిగి 75 అడుగుల వరకు వస్తుందన్న సమాచారం మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాచలం పట్టణం ఏఎంసీ కాలనీ, సుభాష్ నగర్, శాంతి నగర్, మిథిలా స్టేడియంలో వరుద నీరు చేరడంతో ఆయా ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మోకాళ్ల లోతు నీళ్లలో మంత్రి పువ్వాడ స్వయంగా వెళ్ళి ప్రజలకు విన్నవించారు. ముంపునకు గురైన వివిధ ప్రాంతాలలో ప్రజలను తక్షణమే తరలించాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.