AP Police Notices to RGV : రామ్‌గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు - విచారణకు రావాలని ఆదేశాలు..!
సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు అందజేశారు. నవంబర్ 19న విచారణకు హాజరుకావాలని కోరారు.
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు అందజేశారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా వర్మ పోస్టులు, వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందింది. టీడీపీకి చెందిన రామలింగం ఫిర్యాదు మేరకు నవంబర్ 12, 2024వ తేదీన ఈ కేసు నమోదైంది. ‘వ్యూహం’ చిత్రం ప్రచార కార్యక్రమాలలో రాజకీయ ప్రముఖులను కించపరిచేలా వర్మ చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో ప్రస్తావించారు.
ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు.. BNS చట్టంలోని 336 (4), 353 (2) సెక్షన్ల కింద ఆర్జీవీపై కేసు నమోదు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ధృవీకరించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆర్జీవీ డెన్ కార్యాలయంలో వర్మకు నోటీసులు అందించినట్లు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ సమయంలో ఆర్జీవీ...కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ విరుచుకుపడేవారు. వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం ఆధారంగా తీసిన 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేశ్, బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేత రామలింగం ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఐటీ చట్టం కింద ఆర్జీవీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైసీపీ ప్రభుత్వ సమయంలో...కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో కొందరు పరిధి దాటి వ్యవహరించేవారు. ఇందులో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ , అనిత, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. సోషల్ మీడియాలో విచ్చలవిడితనం మరింతగా పెరిగిపోవడంతో...ఏపీ పోలీసులు తాజాగా ఆ దిశగా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వంలో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని వారి కుటుంబ సభ్యులపై సైతం అత్యంత దారుణంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన భాషలో చెలరేగిపోయిన వారిని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందర్నీ అరెస్ట్ చేశారు. మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. పరిధిదాటి ప్రవర్తిస్తున్న వారికి పోస్టులను బట్టి నోటీసులు ఇవ్వడం, కౌన్సిలింగ్, కేసులు, పలువురి అరెస్టులు జరుగుతున్నాయి. అరెస్టు చేసిన తర్వాత... వారి కుటుంబ సభ్యులకు ఎంత అనుచితంగా పోస్టులు పెట్టారో వివరిస్తున్నారు. సోషల్ మీడియాలో మేసేజ్ లను గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసిన వారిని పోలీస్ స్టేషన్లకు పిలిచి వివరాలు సేకరిస్తున్నారు. వివాదాస్పద పోస్టులకు లైకులు కొట్టిన వారికి వాట్సాప్ ద్వారా 160 సీఆర్పీసీ నోటీసులు పంపుతున్నారు.
పోసానిపై ఫిర్యాదు:
మరోవైపు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై విజయవాడ పోలీసులకు జనసైనికులు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో... జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యుల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నేతలు తాజా విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో సైతం పోసానిపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదన్నారు. పోసాని చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని జనసేన పార్టీ నేత బాడిత శంకర్ అన్నారు. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. సోషల్ మీడియాలో పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు తీసివేయాలని తమ ఫిర్యాదులో పోలీసులను కోరామన్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.