AP Govt Reliance MoU : ఏపీలో రిలయ్సన్ రూ.65 వేల కోట్ల పెట్టుబడులు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ
AP Govt Reliance MoU : ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. ఏపీలో 500 బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు రూ.65 వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ సంస్థ ఎంవోయూ చేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు సమక్షంలో మంగళవారం ఏపీ పరిశ్రమల శాఖతో, రిలయన్స్ ఇండస్ట్రీన్ ఒప్పందం చేసుకుంది. ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనుంది. రూ.65 వేల కోట్ల పెట్టుబడులతో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరగనుందని రిలయన్స్ బయో ఎనర్జీ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ బషీర్ షిరాజీ తెలిపారు.
రూ.65 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందం
ఏపీ ప్రభుత్వంతో, రిలయన్స్ సంస్థ ఎంఓయూ చేసుకోవడం, ఒక చారిత్రాత్మక ఘట్టమని మంత్రి లోకేశ్ అన్నారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక రీసెర్చ్ సెంటర్ పెడుతున్నారని తెలిసిందని, దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు విజనరీ ఆలోచనతో తెచ్చిన, కొత్త క్లీన్ ఎనర్జీ పాలసీతో, ఏపీలో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ అన్నారు.
గత నెలలో రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తోన్న అనంత్ అంబానీని లోకేష్ ముంబయిలో కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను మంత్రి లోకేశ్ వారికి వివరించారు. ఏపీలో పెట్టుబడులకు ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "రిలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్ లను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేస్తారు. ఒక్కో ప్లాంటును రూ.131 కోట్లతో నిర్మిస్తారు. మొత్తం రూ.65 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఇటీవలే క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకుని వచ్చాం. ఈ పాలసీ ప్రకారం పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది." అన్నారు.
ఏపీలో కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ కోసం రిలయన్స్ ఎంవోయూ చేసుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 500 సీబీజీ ప్లాంట్ల కోసం ఎంఓయూ జరిగిందన్నారు. వచ్చే 25 ఏళ్లలో రూ.57,650 కోట్ల బెనిఫిట్ ఉంటుందన్నారు. ఒక్కొక రైతుకు రూ.30 వేల లీజ్ వస్తుందని, 500 ప్లాంట్లు పూర్తయితే రెన్యువబుల్ ఫ్యూయల్ 9.35 లక్షల ఎల్సీబీలకు రీప్లేస్మెంట్ చేస్తారన్నారు. ఈ ప్రాజెక్టుతో 2.50 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 20 లక్షల ఉద్యోగాలలో ఇదొక భాగం అన్నారు. ఈ ప్రాజెక్టులో 39 లక్షల మెట్రిక్ టన్నుల సీబీజీ ఏడాదికి వస్తుందన్నారు. అలాగే 110 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ తో కెమికల్స్ వాడకం తగ్గుతుందన్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 ద్వారా రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
సంబంధిత కథనం