Social Media Politics: సోషల్ మీడియా పాలిటిక్స్‌ ముద్దు, పబ్లిక్ పాలిటిక్స్‌ వద్దు.. వైసీపీ వ్యూహం అదేనా?-social media politics enough for ycp no public politics is that ycps strategy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Social Media Politics: సోషల్ మీడియా పాలిటిక్స్‌ ముద్దు, పబ్లిక్ పాలిటిక్స్‌ వద్దు.. వైసీపీ వ్యూహం అదేనా?

Social Media Politics: సోషల్ మీడియా పాలిటిక్స్‌ ముద్దు, పబ్లిక్ పాలిటిక్స్‌ వద్దు.. వైసీపీ వ్యూహం అదేనా?

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 10, 2024 01:15 PM IST

Social Media Politics: ఏపీలో మళ్ళీ సోషల్ మీడియా పాలిటిక్స్‌ మొదలయ్యాయి..ఎన్నికల్లో గెలిచిన మూడు నెలల్లోనే ఎన్డీఏ కూటమి పార్టీలకి సోషల్‌ మీడియా నీడలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష వైసీపీ సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది.వైసీపీ ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో అధికార పార్టీ వెనకబడింది.

వైఎస్ జగన్ వ్యూహం అదేనా?
వైఎస్ జగన్ వ్యూహం అదేనా?

Social Media Politics: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సోషల్‌ మీడియా ఎప్పుడో వేదికై పోయింది.ఏపీ రాజకీయాల్లో పొలిటికల్‌ కన్సల్టెంట్ల ప్రయేయం మొదలయ్యాక అధికారాన్ని చేరుకోడానికి, అధికారాన్ని నిలబెట్టుకోడానికి సోషల్‌ మీడియానే వేదికగా మారింది. ముసుగు ముఖాలతో సోషల్ మీడియాలో చేసే ప్రచారమే పార్టీలకు ఊపిరి పోస్తోంది. అన్ని పార్టీలు కొన్నేళ్లుగా ఇదే పంథాలో పయనిస్తున్నాయి.

ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ వేగంగా తేరుకున్నట్టు కనిపిస్తోంది. నెలన్నర లోపే వైసీపీ సోషల్‌ మీడియా ఖాతాలను ఆ పార్టీ యాక్టివేట్‌ చేసుకుంది. మొదట్లో కొన్నాళ్లు తాడేపల్లిలోని జగన్ నివాసం సమీపంలోని విల్లాల్లో ఆ పార్టీ సోషల్‌ మీడియా కార్యకలాపాలను నిర్వహించారు. పోలీస్‌ కేసులు, సాంకేతిక కారణాలతో మరో ప్రాంతానికి తమ బృందాలను ఆ పార్టీ తరలించేసింది.

అధికారానికి దూరమైన తర్వాత వైసీపీ అధ్యక్షుడు తరచూ బెంగుళూరు వెళ్లిపోతున్నా పార్టీ శ్రేణులకు, గతంతో పోలిస్తే వీలైనంత ఎక్కువగానే అందుబాటులో ఉంటున్నారు. మొదట్లో పార్టీ కార్యకర్తల ఆందోళనలు, నిరసన స్వరాలు వినిపించడంతో కార్యకర్తలతో కలవడానికి కూడా ఆ పార్టీ అధినేత విముఖత చూపించారు. పార్టీ శ్రేణుల్ని కలిసే కార్యక్రమాలకు స్వస్తి పలికారు. ‎ఆ తర్వాత అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు.

ఔట్ డోర్‌ ప్రోగ్రాంలు వద్దు.. సోషల్ మీడియా ముద్దు..

వైసీపీ ముఖ్య నేతల వ్యవహార శైలిపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నా, సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా రీచ్‌ వస్తుందని ఆ పార్టీ బాధ్యులు అభిప్రాయపడుతున్నారు. బహిరంగ కార్యక్రమాలు చేపడితే నేతలు సొంతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందనే ఆందోళన కూడా మరో కారణమని చెబుతున్నారు.

వినుకొండలో జరిగిన వైసీపీ సానుభూతిపరుడు రషీద్ హత్య, జైల్లో నందిగం సురేష్ పరామర్శ, వరద బాధితులు, వైసీపీ ముఖ్యనాయకులకు అనారోగ్యం నేపధ్యంలో పరామర్శ వంటి కార్యక్రమాలను జగన్ నిర్వహించారు. ఈ క్రమంలో గత నెలలో వచ్చిన వరద సహాయక చర్యల్లో అధికార పార్టీ విఫలమైందని విస్తృత ప్రచారం చేసింది.

వరద బాధితులకు సహాయక చర్యలు, నష్టపరిహారం చెల్లింపు విషయంలో క్షేత్ర స్థాయిలో పోరాటాలు సీపీఎం చేస్తే సోషల్ మీడియా వాటిని ప్రచారాస్త్రాలుగా వైసీపీ మార్చుకుంది. బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో జరిగిన లోపాలను గణాంకాలతో సీపీఎం నాయకులు ఎండగట్టారు. సీపీఎం ఆందోళన నేపథ్యంలోనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ విడుదల చేసిన వివరాలతో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చెలరేగిపోయారు.

మొదట్లో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూటమి ప్రభుత్వం భావించింది. చివరకు బాధితులకు చెల్లించిన నష్టపరిహారం కంటే వరద సహాయక చర్యల పేరిట చేసిన ఖర్చు ఎక్కువ ఉందని జనంలోకి బలంగా వెళ్లడంతో ప్రభుత్వం చేసిన సాయం మొత్తం కొట్టుకుపోయింది. చివరకు మంత్రులు అంతా క్యూ కట్టి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

మరోవైపు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విషయంలో ప్రతిపక్షానికి ఉండే అవకాశాలను వైసీపీ అందిపుచ్చుకుంటోంది. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో మాత్రం వైసీపీ తాజా మాజీ నాయకుల ఉనికి ఎక్కడా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు అధికారాన్ని ఎంజాయ్ చేసిన నేతలంతా పవర్ పోగానే ఎక్కడి వారు అక్కడ సర్దుకుంటున్నారు.

మంత్రి పదవుల్ని అనుభవించిన వారు, అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష టీడీపీపై నోరు పారేసుకున్న నాయకులు ఎక్కడా చప్పుడు చేయడం లేదు. కేవలం సోషల్ మీడియాలో ముఖాలు లేని ఖాతాలతో పాటు ఆ పార్టీలో మొదటి నుంచి సాగుతున్న వాళ్లు మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. పార్టీతో ప్రయోజనం పొందిన వాళ్లంతా తమకెందుకు అనవసర వివాదాలని భావిస్తున్నారు.

గతంలో వైసీపీ హయంలో సోషల్ మీడియా కోసం పనిచేసిన వారిలో ఎంపిక చేసుకున్న వారిని పార్టీ సొంత ఖర్చులతో ఆన్‌లైన్ ప్రచారానికి వినియోగించు కుంటున్నట్టు తెలుస్తోంది. తక్కువ ఖర్చుతో పార్టీ కార్యక్రమాలను యాక్టివ్‌గా ఉంచడమే లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా బృందాలు పనిచేస్తున్నాయి.

ముఖ్యమైన నాయకులు ఎవరు ఇప్పట్లో సొంత డబ్బులతో పార్టీ కార్యక్రమాలు చేసే పరిస్థితులు లేకపోవడంతో అప్పటి వరకు సోషల్‌ మీడియా ప్రచారంతో సరిపెట్టుకోవాలని వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. కనీసం కమ్యూనిస్టు పార్టీల తరహాలో కూడా నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, రాజకీయ కార్యక్రమాలను నిర్వహించలేకపోవడం కూడా లోటుగా కనిపిస్తోంది.

Whats_app_banner