Posani Krishna Murali : ఇక పోసాని కృష్ణమురళి వంతు, విజయవాడలో జనసైనికుల ఫిర్యాదు
Posani Krishna Murali : వైసీపీ హయాంలో ప్రత్యర్థులపై పరిధిదాటి ప్రవర్తించిన వారికి కూటమి సర్కార్ షాక్ లు ఇస్తుంది. వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై తాజాగా విజయవాడలో జనసైనికులు ఫిర్యాదు చేశారు. రాజమండ్రిలో నమోదైన కేసును యాక్టివ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి మద్దతుగా కొందరు సినీ, రాజకీయ నేతలు ప్రత్యర్థులపై పరిధిదాటి మాట్లాడేవారు. ఇక సోషల్ మీడియాలో ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై అసభ్యంగా పోస్టులు పెట్టేవారు. బోరుగడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ఆర్జీవీ...ఇలా వైసీపీ మద్దతుదారులు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై సందర్భం దొరికితే చాలు అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడేవాళ్లు. ఆడబిడ్డలపై అసభ్య పదజాలంతో దూషణలు చేసేవారు. వీరందరికీ కూటమి సర్కార్ షాక్ లు ఇస్తుంది. సోషల్ మీడియా పరిధిదాటి ప్రవర్తించిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయగా.. తాజాగా పోసాని వంతు వచ్చింది.
వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై విజయవాడ పోలీసులకు జనసైనికులు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో... జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యుల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నేతలు తాజా విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో సైతం పోసానిపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదన్నారు. పోసాని చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని జనసేన పార్టీ నేత బాడిత శంకర్ అన్నారు. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. సోషల్ మీడియాలో పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు తీసివేయాలని తమ ఫిర్యాదులో పోలీసులను కోరామన్నారు.
టార్గెట్ పోసాని
సినీ నటుడు, దర్శకుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి జనసేన నేతలు మరో షాక్ ఇచ్చారు. గతంలో పవన్ కల్యాణ్ , ఆయన ఫ్యామిలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జనసైనికులు ఫిర్యాదుతో రాజమండ్రిలో కేసు నమోదైంది. ఈ కేసును జనసేన లీగల్ సెల్ యాక్టివ్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో పోసానిపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని జనసేన లీగల్ సెల్ కోరింది. 2021లో వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల దుస్థితిపై జనసేన ఆందోళన చేపట్టింది. గాంధీ జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ రాజమండ్రిలో రోడ్ల గుంతలు పూడ్చి నిరసన తెలిపారు. ఆ సమయంలో పవన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, జనసేన వీర మహిళలపై పోసాని అసభ్య పదజాలంతో దూషించారు.
పోసాని వ్యాఖ్యలపై అప్పట్లోనే రాజమండ్రి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో జనసైనికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేశారు. కోర్టు ఆదేశాలతో 2022 నవంబర్ లో పోసానిపై కేసు నమోదు చేశారు. తాజాగా వైసీపీ సోషల్ మీడియా అనుచిత పోస్టులపై కేసులు నమోదు అవుతుండడంతో... పోసాని కేసును జనసేన యాక్టివ్ చేసింది.
శ్రీరెడ్డి ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం- మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీ హయాంలో అధికారం చూసుకుని, నోటికొచ్చినట్లు మాట్లాడినప్పుడు తెలియదా? ఇప్పుడు అరెస్టులోత ఒక్కొక్కరూ ఫ్యాంట్ లు తడుపుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కొందరు ఉచ్ఛనీచాలు మరిచి, ఆడవాళ్లను సైతం తిట్టించారని... ప్రశ్నిస్తే బాధితులపైనే తిరిగి కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. తమపై నోటికొచ్చిన బూతులు తిట్టి, అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరెడ్టి లాంటివాళ్లు ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ప్రభుత్వంలో కొందరు కన్ను మిన్ను తెలియకుండా పిచ్చికూతలు కూశారన్నారు. ఇలాంటి వారు మరోసారి నీచమైన భాష వాడకుండా కఠినంగా శిక్షించాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం