మద్దిపాడులో టీడీపీ మహానాడు...?-tdp mahanadu venue changed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మద్దిపాడులో టీడీపీ మహానాడు...?

మద్దిపాడులో టీడీపీ మహానాడు...?

HT Telugu Desk HT Telugu
May 15, 2022 11:10 AM IST

తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించే మహానాడు కార్యక్రమ ప్రాంగణాన్ని ఒంగోలు నుంచి నగర శివార్లలోకి మార్చనున్నారు. మహానాడు నిర్వహణకు అనువైన ప్రాంగణం లభించకపోవడం, ఎంపిక చేసిన స్థలం చిత్తడిగా మారడంతో ఒంగోలు శివార్లకు మహానాడు వేదిక మార్చే యోచనలో పార్టీ నేతలు ఉన్నారు.

<p>తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు</p>
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఒంగోలు నుంచి పట్టణ శివార్లలో ఉన్న మద్దిపాడు మండలం గుండ్లాపల్లికి మార్చాలని యోచిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో మొదట ఎంపిక చేసిన బృందావన్ గార్డెన్స్‌ బురదమయం కావడంతో ఆ పార్టీ నేతలు పునరాలోచనలో పడ్డారు. మే 27,28 తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయించిన తర్వాత నగరంలోని మినీ స్టేడి‍యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుండటంతో మినీ స్టేడియం కేటాయించలేమని జిల్లా అధికారులు చెప్పడంతో ప్రత్యామ్నయాలపై దృష్టిపెట్టారు. నగరు శివారు ప్రాంతంలో ఉన్న త్రోవగుంట బృందావన్ గార్డెన్స్‌లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే వర్షాలతో ఆ ప్రాంతం మొత్తం చిత్తడిగా మారడం, మరోసారి వర్షాలు కురిసితే ఏర్పాట్లు మొత్తం వృధా అయ్యే పరిస్థితి ఉండటంతో అక్కడి నుంచి వేదికను మార్చాలని పార్టీ నాయకులు నిర్ణయించారు.

ఒంగోలుకు 15కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్దిపాడు మండలం, గుండ్లాపల్లి మహీ అగ్రోస్‌ ప్రాంగణంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, మహానాడు సన్నాహక కమిటీ నేతలు ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని పరిశీలించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పరిశీలించిన తర్వాత ఒంగోలు కంటే మద్దిపాడులోనే మహానాడు నిర్వహించడానికి అనువుగా ఉంటుందని అభిప్రాయానికి వచ్చారు. పదివేల మంది సరిపోయేలా ఉన్న హాలుతో పాటు సమీపంలో 25ఎకరాల ఖాళీ స్థలం ఉండటంతో పార్కింగ్‌కు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. చంద్రబాబు అమోదం లభించిన తర్వాత మే 20నుంచి మహానాడు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రెండురోజుల్లో వేదికను ఖరారు పరిశీలించి చంద్రబాబుకు నివేదిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం