Case Filed on RGV : ఆర్జీవీకి షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు- సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు-prakasam police filed case on director ram gopal varma objectionable comments on cbn lokesh pawan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Case Filed On Rgv : ఆర్జీవీకి షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు- సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు

Case Filed on RGV : ఆర్జీవీకి షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు- సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు

Bandaru Satyaprasad HT Telugu
Nov 11, 2024 02:57 PM IST

Case Filed on RGV : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దపాడు పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో... చంద్రబాబు, లోకేశ్ , పవన్ లక్ష్యంగా సినిమాలు తీసిన ఆర్జీవీ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఫిర్యాదుతో ఆర్జీపీపై కేసు నమోదు చేశారు.

 ఆర్జీవీకి షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు- సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు
ఆర్జీవీకి షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు- సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ సమయంలో ఆర్జీవీ...కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ విరుచుకుపడేవారు. వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం ఆధారంగా తీసిన 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేశ్‌, బ్రాహ్మణిపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేత రామలింగం ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఐటీ చట్టం కింద ఆర్జీవీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వైసీపీ ప్రభుత్వ సమయంలో...కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో కొందరు పరిధి దాటి వ్యవహరించేవారు. బోరుగడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి, ఆర్జీవీ, పోసాని కృష్ణమురళి....ఇలా చాలా మంది చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ , అనిత, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. సోషల్ మీడియాలో విచ్చలవిడితనం మరింతగా పెరిగిపోవడంతో...ఏపీ పోలీసులు తాజాగా ఆ దిశగా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వంలో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని వారి కుటుంబ సభ్యులపై సైతం అత్యంత దారుణంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

బెదిరింపులు, హత్యాయత్నం..ఇలా పలు కేసుల్లో వైసీపీ మద్దతుదారుడు బోరుగ‌డ్డ అనిల్ కుమార్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. శ్రీరెడ్డి, పోసాని, ఆర్జీవీపై చర్యలకు పోలీసులు సిద్ధం అవుతున్నారని సమాచారం. ఆర్జీవీపై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో నేపథ్యంలో వైసీపీ మద్దతుదారు శ్రీరెడ్డి స్పందించారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ తో సహా కూటమి నేతలకు పేరు పేరునా క్షమాపణలు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తాము కూటమి నేతలను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టామని చెప్పారు.

కూటమి నేతలపై సోషల్‌ మీడియాలో అత్యంత దారుణమైన భాషలో చెలరేగిపోయిన పోలీసుల చర్యలతో దారికి వస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహంతో... సీఎం చంద్రబాబు ఆదేశాలతో సోషల్‌ మీడియాపై పోలీసులు దృష్టి సారించారు. పరిధిదాటి ప్రవర్తిస్తున్న వారికి పోస్టులను బట్టి నోటీసులు ఇవ్వడం, కౌన్సెలింగ్‌, కేసులు, పలువురి అరెస్టులు జరుగుతున్నాయి. అరెస్టు చేసిన తర్వాత... వారి కుటుంబ సభ్యులకు ఎంత అనుచితంగా పోస్టులు పెట్టారో వివరిస్తున్నారు. సోషల్ మీడియాలో మేసేజ్ లను గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేసిన వారిని పోలీస్ స్టేషన్లకు పిలిచి వివరాలు సేకరిస్తున్నారు. వివాదాస్పద పోస్టులకు లైకులు కొట్టిన వారికి వాట్సాప్‌ ద్వారా 160 సీఆర్పీసీ నోటీసులు పంపుతున్నారు.

రాజకీయ దురుద్దేశంతో కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్‌, అసభ్యకరమైన వీడియోలు పెట్టిన వారిపై భారత న్యాయ సంహిత సెక్షన్‌ 111 ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. పోలీసుల యాక్షన్ తో సోషల్ మీడియాలో విపరీత ధోరణితో ప్రవర్తించిన వారిలో గుబులు మొదలైంది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని, తప్పైపోయిదని పోస్టులు పెడుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం