AP Assembly Sessions :రేపట్నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ఈ సారి పూర్తిస్థాయి బడ్జెట్, సభకు దూరంగా వైసీపీ..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి ప్రారంభం కానున్నాయి. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. మరోవైపు కీలక బిల్లులకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ప్రతిపక్ష వైసీపీ గైర్హాజరుతో ఏకపక్షంగా సమావేశాలు జరగనున్నాయి.
మరోవైపు రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఉంది. సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. ప్రస్తుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగుస్తుంది.
ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అధికార యంత్రంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అయితే కీలకమైన ప్రజా సమస్యలు ఏ మేరకు చర్చకు వస్తాయన్నదే అనుమానంగా మారింది. ఎందుకంటే అసెంబ్లీ ఏకైక ప్రతిపక్ష పార్టీ వైసీపీ సమావేశాలకు దూరంగా ఉండటమే దీనికి కారణం. ప్రతిపక్ష పార్టీ లేకుండా సమావేశాలు నిర్వహించడంతో కేవలం ఇవి కూటమి పార్టీ సమావేశాలుగానే ఉంటాయని విశ్లేషుకులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే…!
తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తన నివాసం నుంచే మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ప్రకటించారు. తనకు అసెంబ్లీలో మాట్లాడటానికి ఎక్కువ సమయం మైక్ ఇవ్వల్సి వస్తుందేమోననే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
అసెంబ్లీకి గైర్హాజరు కావాలని వైసీపీ తీసుకున్న నిర్ణయంపై కూటమి పార్టీలు తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టాయి. తాము నిలదీస్తామేమోనని వైసీపీ ఈ సమావేశాలకు రాకూడదని నిర్ణయించుకుందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ సభ్యులకు గత సమావేశాల్లో మైక్ ఇచ్చామని, ఈసారి కూడా ఇస్తామని తెలిపారు. సభకు వచ్చి వారి అభిప్రాయాలు చెప్పొచ్చని, అంతేతప్ప మైక్ ఇవ్వలేదనడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, నియంతృత్వంపై నిలదీస్తామనే సభకు రావటం లేదని పేర్కొన్నారు.
ఇది మొదటిసారా..?
అయితే అసెంబ్లీకి ప్రతిపక్షం దూరంగా ఉండటం ఇది మొదటి సారి కాదు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏర్పడిన ప్రతి శాసనసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కొంత వరకు అసెంబ్లీకి హాజరై, ప్రభుత్వంపై విమర్శుల చేసి సమావేశాలను బహిష్కరించింది.
2019లో వైసీపీ అధికారంలోకి రాగాగే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూడా కొంత వరకు అసెంబ్లీకి హాజరై, ఆ తరువాత తనకు అవమానం జరిగిందని చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. తాను సీఎం అయిన తరువాతే మళ్లీ సభలో అడుగుపెడతానని ప్రకటించి, నాటి నుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు.
మళ్లీ ఇప్పుడు వైసీపీ వంతు రావడంతో మొదటి సమావేశాలకు హాజరైంది. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో మాట్లాడేందుకు సమయం చాలా తక్కువ ఇస్తారు. ఈ నేపథ్యంలో తమకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఉండదని, అసెంబ్లీ బయటనుంచే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పి సమావేశాలను బహిష్కరించింది.