AP Budget 2024 :అన్నదాతలు, ఆడబిడ్డలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్-సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు, ఫ్రీ బస్ పై ప్రకటన
AP Budget 2024 : ఏపీ బడ్జెట్ లో మరో రెండు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు నిధులు కేటాయించామని మంత్రి పార్థసారథి తెలిపారు. అలాగే మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఈ ఏడాదిలోనే అమలు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20 వేలు అందిస్తామన్నారు.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై మంత్రి పార్థ సారథి మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్ లో నిధులు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతికి వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టిందని మంత్రి పార్థసారథి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. వైకాపా సర్కార్ రూ. 1.35 లక్షల కోట్ల మేర బకాయిలు పెట్టిందన్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృష్టి చేస్తోందన్నారు.
కూటమి పార్టీల ఎన్నికల హామీలు 'సూపర్ సిక్స్' పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే రెండు ప్రధాన హామీలు అమలు చేశామన్నారు. పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామన్నారు. అలాగే ఉచిత గ్యాస్ హామీ అమలుకు రూ. 840 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. మరో రెండు పథకాల అమలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామని మంత్రి పార్థసారథి తెలిపారు.
సంక్రాంతి నుంచి అన్నదాత సుఖీభవ పథకం
కూటమి సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్‍లో 'అన్నదాత సుఖీభవ' పథకానికి రూ.4,500 కోట్ల నిధులు కేటాయించింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.20 వేలు జమ చేయనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ మేరకు బడ్జె్ట్ లో నిధులు కేటాయించింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన రూ.6 వేలకు తోడు ఏపీ సర్కార్ రూ.14 వేలు కలిపి రైతుల ఖాతాల్లో రూ.20 వేలు జమచేయనున్నారు. 2025 సంక్రాంతి నుంచి పథకాన్ని అమలు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
"కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమం కింద రైతులకు "అన్నదాత సుఖీభవ - పీఎమ్. కిసాన్" పథకంలో ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమమే " పొలం పిలుస్తోంది." ప్రతి మంగళ, బుధ,వారాల్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజా ప్రతినిధులు పొలం బాట పడతారు. అర్హతగల కౌలు రైతులందరికీ కౌలు రైతు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు 2024 కొత్త సాగుదారుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు నేరుగా తమ సమస్యలు, సందేహాలను టోల్ ఫ్రీ నెం. 155251 కు ఫోన్ చేసి పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాలను నివృత్తి చేస్తున్నాం"- మంత్రి అచ్చెన్నాయుడు
సంబంధిత కథనం