AP Budget 2024 : నవంబర్ రెండో వారంలో ఏపీ బడ్జెట్..! 3 ప్రాజెక్టులకు పెద్దపీట.. 6 ముఖ్యాంశాలు
AP Budget 2024 : కూటమి ప్రభుత్వం ఇంకా బడ్జెడ్ ప్రవేశపెట్టడం లేదని.. జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. చాలామంది ఏపీ బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ రెండో వారంలో ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
నవంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. నవంబర్ రెండో వారంలో సమావేశాలు నిర్వహించి.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మూడు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఏపీ బడ్జెట్ 2024కు సంబంధించి 6 ముఖ్యాంశాలు ఇవీ..
1.అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2,86,389 కోట్లకు బడ్జెట్ సమర్పించారు. 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు గత ప్రభుత్వం శాసనసభ ఆమోదం తీసుకుంది.
2.జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. కానీ.. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. దీంతో మరోసారి ఓటాన్ అకౌంట్‌కు ఆర్డినెన్సు రూపంలో ఆమోదం తీసుకున్నారు.
3.ఆగస్టు నుంచి నవంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు, ఇతర కార్యకలాపాల కోసం రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్ నుంచి ఆమోదం తీసుకున్నారు. మొత్తం 8 నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ పద్దుతోనే గడిచిపోయింది.
4. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే వృద్ధాప్య, ఇతర పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. కానీ.. మిగిలిన సంక్షేమ పథకాల అమలు సరిగా జరగడం లేదు. దీంతో ఈ బడ్జెట్‌లో ఆయా పథకాల కోసం నిధులు కేటాయించేందుకు ఆర్థికశాఖ ప్లాన్ చేస్తోంది.
5.గతంలో జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇప్పుడు కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే.. గతంలో కంటే ఎక్కువ నిధులు అవసరం. దాదాపు రూ.20 వేల కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిధుల సమీకరణ, కేటాయింపుల విషయంలో ఆర్థిక శాఖ అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పథకానికి ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలు వేస్తున్నారు.
6.ఈ ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్ దాదాపు రూ.2.90 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుకు పెద్దపీట వేయనున్నారు. అటు కేంద్రం నుంచి వచ్చే నిధులు, సాయంపైనా ఈ బడ్జెట్‌లో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.