AP Flood Relief : కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్ల ఖర్చు, సోషల్ మీడియా ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ ఏపీ క్లారిటీ
AP Flood Relief : ఏపీలో ఇటీవల వరదల సహాయక చర్యల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది అవాస్తమని కేవలం రూ.23 లక్షలు ఖర్చు చేశామని అధికారులు స్పష్టం చేశారు. ఏపీ ఫ్యాక్ట్ చెక్ దీనిని నిర్థారించింది.
వరద సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఖర్చు 139.75 కోట్లు ఖర్చు చేశారని ఫ్యాక్ట్ చెక్ ఏపీ స్పష్టం చేసింది. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ ఏపీ క్లారిటీ ఇచ్చింది. సహాయక చర్యలకు చేసిన ఖర్చు అంతా పారదర్శకంగాఉందని, వాస్తవంగా రూ.23 లక్షల ఖర్చు అయ్యిందని తెలిపారు. ఖర్చుల వివరాలు, గణాంకాలు, చెల్లించిన సొమ్ము పూర్తి పారదర్శకంగా ఉందని ఎక్స్ లో ట్వీట్ చేసింది.
అగ్గిపెట్టెలకు, కొవ్వోత్తులకు రూ.23 కోట్లు అసత్య ప్రచారం
వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు చేశారని సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఒక ప్రకటనలో ఈ ప్రచారాలను ఖండించారు. అవన్నీ ఫేక్ ప్రచారాలని కొంతమంది ప్రభుత్వంపై బురద చల్లడం కోసం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. వరదల కారణంలో వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా లేక రాత్రిళ్లు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని, వారికి రాత్రిళ్లు ఇబ్బందులు తలెత్తకుండా మొబైల్ జనరేటర్లు తలరించి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా కేవలం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీకి రూ.23 కోట్లు వెచ్చించామనడం పూర్తీగా నిరాధారం అన్నారు. ఈ ఖర్చు ప్రధానంగా మొబైల్ జనరేటర్ల కోసం వెచ్చించిందన్నారు. దీంతో పాటు వరద బాధితులకు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు కూడా అదనంగా అందించామని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని చేస్తున్న ఇలాంటి ప్రచాలను ప్రజలు ఏమాత్రం విశ్వసించకుండా అప్రమత్తంగా ఉండాలని సిసోడియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వరద సహాయక చర్యలకు అయిన ఖర్చును స్పష్టంగా తెలిపినా, మళ్లీ ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు పోలీసులను ఆశ్రయిస్తామన్నారు. వీరిపై తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఆధారాలు లేకుండా, కావాలని తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మంత్రి నారా లోకేశ్ ఫైర్
వరద బాధితులకు ఇస్తామన్న కోటిలో ఒక్క రూపాయి కూడా వైసీపీ అధినేత జగన్ ఇప్పటికీ ఇవ్వలేదంటూ మంత్రి లోకేశ్ విమర్శించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. వరదబాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంపిణీ చేయని జగన్ వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నారన్నారు. వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేయిస్తున్నారన్నారు. వీటికి ఖర్చు రూ.23 లక్షలు కూడా కాలేదన్నారు. జగన్ చీకటి పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి..ఇవిగో ఖర్చుల లెక్కలు.. అన్నీ పారదర్శకంగా ఉన్నాయన్నారు.తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కుని ప్రజాధనం కోట్లు ఎగ్ పఫ్‌లు మెక్కి, నిమ్మకాయ నీళ్లులా తాగేసిన వైఎస్ జగన్ ఇకనైనా ఫేక్ ప్రచారాలు ఆపాలని కోరారు.