Rare Ganesh Sculpture In Macherla : ఇలాంటి వినాయకుడి విగ్రహం చూసి ఉండరేమో
కొన్ని ప్రాంతాల్లో పురాతన వస్తువులు బయటపడుతుంటాయి. అయితే కొన్ని సాధారణంగానే కనిపిస్తాయి. కానీ మరికొన్ని మాత్రం ఎప్పుడు చూడనివి బయటపడతాయి. తాజాగా మాచర్లలో అలాంటి వినాయకుడి శిల్పం బయటపడింది.
పురాతన వస్తువులు, దశాబ్దాల నాటి శిలలు, విగ్రహాలు, అలనాటి చరిత్ర సంస్కృతి కొన్నిసార్లు పురవాస్తువారి పరిశోధనలో బయపడతాయి. తాజాగా ఏపీలో అరుదైన వినాయకుడి విగ్రహం లభ్యమైంది. పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో 12 శతాబ్దం నాటి అరుదైన గణపతి విగ్రహం దొరికింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలోని ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయంలో గణేశుడు పోరాట భంగిమలో ఉన్న అరుదైన శిల్పం అది.
ఈ పురాతన విగ్రహం అందరి దృష్టి ఆకర్శిస్తోంది. మాచర్ల పట్టణంలో 12 శతాబ్దం నాటి అరుదైన గణేశుడి విగ్రహం లభ్యమైందని.. పురావస్తు శాస్త్రవేత్త, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఇ.శివనాగిరెడ్డి అన్నారు. ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయంలోని రంగమండప స్తంభం మధ్య భాగంలో గణేశుడి పోరాట విగ్రహం ప్రతిమ ఉందన్నారు. పురాణంలో పేర్కొన్న విధంగా గణేశుడు ఓ రాక్షసుడితో పోరాటం చేస్తున్నట్టు ఉందని చెప్పారు. ప్రజలు వారసత్వ సంపదను కాపాడాలని శివనాగిరెడ్డి కోరారు. ఈ విగ్రహంలో వినాయకుడు ఒక్క చేతిలో గొడ్డలి, మరో చేతితో కొరడ పట్టుకుని ఉన్నాడు. మరో రెండు చేతులతో రాక్షసుడితో పోరాటం చేస్తున్నాడు.
అయితే పల్నాడు జిల్లాలో గణేశుడిని అప్పటి నుంచి ఎక్కువగా పూజించేవారని అర్థమవుతోంది. అప్పుడు గణపతి విగ్రహాలన్నీ దాదాపు ఇదే రూపంలో ఉండేవని తెలుస్తోంది. నల్గొండ జిల్లాలోని పాన్‌గల్‌లోని పచ్చల సోమేశ్వరాలయం, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రామాలయం వద్ద 12వ శతాబ్దానికి చెందిన ఇలాంటి విగ్రహాలే దొరికాయి. ఆలయ ప్రాంగణం లోపల ఐకానోగ్రాఫిక్, చారిత్రక వివరాలతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కూడా అరుదైన గణేశుడి శిల్పాన్ని పరిశీలించారు.