Murder for antiques : పురాతన వస్తువుల కోసం మహిళ హత్య…..-woman murdered for antiques in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Woman Murdered For Antiques In Vijayawada

Murder for antiques : పురాతన వస్తువుల కోసం మహిళ హత్య…..

HT Telugu Desk HT Telugu
Jul 20, 2022 08:58 AM IST

రైల్వే ఉద్యోగి ఇంట్లో పురాతన వస్తువులు ఉన్నాయని భావించి వాటిని కొట్టేసే ప్రయత్నాల్లో ఉద్యోగి భార్యను హతమార్చారు. పోలీసులకు సవాలుగా మారిన మర్డర్‌ కేసును సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చేధించి నిందితుల్ని అరెస్ట్‌ చేశారు.

పాత వస్తువుల కోసం మహిళ దారుణ హత్య
పాత వస్తువుల కోసం మహిళ దారుణ హత్య

విజయవాడ సత్యన్నారాయణ పురం రైల్వే క్వార్టర్స్‌లో నివసించే మహిళ గత వారం దారుణ హత్యకు గురైంది. రైల్వే సిగ్నల్‌ అండ్ టెలికాం విభాగంలో పనిచేసే సత్యనారాయణ విధులకు వె‌ళ్లిన సమయంలో అతని భార్యను హతమార్చి విలువైన ఆభరణాలను ఎత్తుకుపోయారు. కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. చివరకు మొబైల్‌ టవర్ల డంప్‌ను శోధించి నిందితుల్ని గుర్తించారు.

రైల్వే క్వార్టర్స్‌లో ఉండే కట్టుంగ సీతను ఆమె ఇంటిలోనే గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి, ఒంటిపై వున్న బంగారు నగలను దొంగిలించుకు పోయిన ఘటనలో నిందితుల్ని పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో బాగంగా సంఘటనా స్థలంలో క్లూస్ టీం, పోలీస్ జాగిలాల సహకారంతో సేకరించిన సమాచారంతో పాటు మొబైల్ ట్రాకింగ్ ద్వారా అనుమానిత వ్యక్తులు మరియు పాత నేరస్తులపై నిఘా ఉంచారు. చోరీ సొత్తును విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కేసు చిక్కుముడి వీడింది.

పాత వస్తువుల కోసం దారుణం

విజయవాడ శివార్లలోని ముస్తాబాద్ గ్రామానికి చెందిన గుమ్మడి నాగేశ్వర రావు తాపీ పనులు చేస్తుంటాడు. ఇతనివద్ద ఐదారుగురు కూలీలు పనిచేస్తున్నారు. రైల్వేలో పనిచేసే నూతంగి సాంబశివరావు ద్వారా రైల్వే టెలికాం డిపార్ట్మెంట్‌లో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న కట్టుంగ సత్య నారాయణ వద్ద విలువైన పాత వస్తువులు ఉన్నాయని తెలుసుకున్నారు. పాతకాలం నాటి వస్తువులకు మార్కెట్లో డిమాండ్‌ ఉంటుందని వాటిని కాజేసేందుకు పథకం రచించారు. రైల్వే క్వాటర్స్‌లో సత్యన్నారాయణ ఇంటికి వెళ్లిన నాగేశ్వరరావు పాత విలువైన వస్తువుల గురించి అడిగే సమయంలో సత్యన్నారాయణ భార్య సీత ఒంటిపై బంగారు నగలు ఎక్కువగా ఉండటం గమనించాడు. వాటిని కాజేయడానికి పథకం పన్ని ఆ విషయాన్నీ కుమారుడు గుమ్మడి వంశీ కృష్ణ, తన వద్ద పని చేసే గాలంకి సతీష్, కోట శ్రీమన్నారాయణ, బండ్ల గణేష్‌లకు చెప్పాడు.

పథకం ప్రకారం జులై 9న సత్యన్నారాయణ ఇంటి నుండి బయటకు వెళ్ళగానే, వంశీకృష్ణ మృతురాలి ఇంటికి వెళ్లి అడ్రస్ అడుగుతునట్లు నటించాడు. అదే సమయంలో గాలంకి సతీష్, కోట శ్రీమన్నారాయణ లు వెనుక గోడ దూకి ఇంట్లో ప్రవేశించాారు. ఇంట్లోకి వచ్చిన వారిని ఆమె చూడటంతో అరిస్తే కత్తితో పొడుస్తామని బెదిరించి, ఆమె ముక్కు, నోటిని పక్కన వున్న టవల్ తో కట్టివేసి, ఆమెకు ఊపిరి ఆడకుండా చేశారు. ఇంకో టవల్ తో కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత దొంగతనం బయట పడుతుందనే ఉద్దేశంతో మరొక టవల్ ఆమె మెడకు చుట్టి చెరోపక్క గట్టిగా లాగి గొంతు బిగించి చంపేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక హతురాలి ఒంటిపైన ఉన్న బంగారు నగలను తీసుకుని పారిపోయారు.

తాపీమేస్త్రీ గుమ్మడి నాగేశ్వరరావు రైల్వే పార్కులో ఉండి పర్యవేక్షించాడు. నేరం జరిగిన 15 నిముషాల తరువాత తన కారులో పరారయ్యాడు. కోట శ్రీమన్నారాయణ, గాలంకి సతీష్‌లు దొంగిలించిన బంగారపు వస్తువులలో వారి వాటాగా వచ్చిన బంగారాన్ని అమ్ము కునే ప్రయత్నాల్లో పోలీసులకు దొరికిపోయారు. వారు ఇచ్చిన సమాచారంతో కానూరు మురళి నగర్ లో ఒక ఇంటిలో మిగిలిన నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తుతో పాటు నేరానికి వాడిన కారు, బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు.

IPL_Entry_Point

టాపిక్