YSR Pension Kanuka : పెన్షన్ల కోతపై గాంధీ విగ్రహం వద్ద ఆందోళన….
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ పెన్షన్లు రద్దు చేయడంపై ఏపీలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆగష్టు నెలలో దాదాపు వేల సంఖ్యలో పెన్షన్లను రద్దు చేయడంతో ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు మాత్రమే అందించడంలో భాగంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పెన్షన్లు నిలిపివేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా డిబిటి స్కీంలను వర్తింప చేస్తున్నామని చెబుతోంది.
ఆగష్టు ఒకటి నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇళ్లలో ఉన్న వృద్ధాప్య, వితంతు, ఒంటరి, వికలాంగుల పెన్షన్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారు అక్రోశం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డుల్ని యూనిట్‌గా పరిగణించి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగాలు చేసే వారు వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నా వారిని లబ్దిదారులుగానే పరిగణిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమైనా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో కడప జిల్లాలో ఓ మహిళ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగింది. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా వివిధ శాఖల్లొ పనిచేస్తున్న చిరుద్యోగుల కుటుంబ సభ్యులకు ఫింఛన్ తోపాటు సంక్షేమ పథకాలను రద్దు చేయడాన్ని తప్పు పడుతూ నాగవేణి అనే మహిళ నిరసన చేపట్టింది. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఫించన్ పొందేందుకు అర్హులైనా రకరకాల కారణాలు చూపుతూ అనర్హులుగా చూపి రద్దు చేయడాన్ని తప్పు పడుతూ, ప్రభుత్వ కార్యక్రమానికి నిరసనగా నాగవేణి ఒంటరి పోరాటానికి దిగింది. ప్రభుత్వం స్పందించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇళ్లలో వారికి పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో వేల సంఖ్యలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో చాలామంది నామమాత్రపు వేతనాలతోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారిని పరిగణించి ప్రభుత్వ పథకాలను రద్దు చేయడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టాపిక్