ఆ శివలింగం 12వ శతాబ్దం నాటిది.....
పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనుల్లో బయటపడిన శివలింగం 12వ శతాబ్దం నాటిదిగా పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు. చాళుక్య రాజుల కాలంలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో శైవం విరాజిల్లిందని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. గోదావరి తీరం పొడవున శైవ మత వ్యాప్తికి సంబంధించిన చారిత్రక ఆధారాలు లభిస్తాయని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు కూడా అలాంటి పురాతన సంపద బయటపడిందని ఆర్కియాలజీ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు గోదావరీ పరివాహక చరిత్రను చెప్పే మ్యూజియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో విలసిల్లిన శైవానికి నిదర్శనంగా స్పిల్ వే ప్రాంతంలో బయటపడిన శివలింగాన్ని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం పోలవరం స్పిల్ వే కనెక్టివిటీ పనుల్లో భాగంగా మట్టి తవ్వకాలు జరుపుతుండగా, ప్రాజెక్టు డ్యాంలో మునిగిపోయిన పాతపైడిపాక గ్రామంలో ఓ భారీ శివలింగం ప్రత్యక్షమైంది. ప్రొక్లెయినర్ తవ్వుతుండగా రాతి శిల అడ్డుపడిందని కూలీలు భావించారు. బలంగా తవ్వడంతో రెండు ముక్కలుగా పగిలిన శివలింగం బయట పడటంతో కూలీలు ఆందోళనకు గురయ్యారు. ఈ వార్త సమీప గ్రామాలకు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో తవ్వకాలు నిలిపివేసి పూజలు జరిపారు. రెవిన్యూ అధికారులు, ఆర్కియాలజీ విభాగానికి సమాచారం ఇవ్వడంతో అధికారులు శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిశీలించారు.
ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ తిమ్మరాజు నేతృత్వంలో శివలింగం బయటపడిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. శివలింగాన్ని పరిశీలించిన అధికారులు దానిని 12వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో 1996-2003 మధ్య కాలంలో ఆర్కియాలజీ విభాగం విస్తృత పరిశోధనలు నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. గోదావరి తీరంలో దాదాపు 375పైగా గ్రామాలు మునిగిపోయాయని దాదాపు 570కు పైగా పురాతన విగ్రహాలను ఆర్కియాలజీ విభాగం కనుగొందని చెప్పారు. చారిత్రక నేపథ్యం ఉన్న పురావస్తు అవశేషాలను భద్రపరచడానికి జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఐదు ఎకరాలను కేటాయిస్తే మ్యూజియం ఏర్పాటు చేయొచ్చని చెప్పారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. రామయ్యపేట ప్రాంతంలో ఐదెకరాల విస్తీర్ణంలో గోదావరి పరివాహక ప్రాంతంలో లభించిన గతకాలపు వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు.
టాపిక్