Wines Closed : రెండు రోజులు వైన్ షాపులు బంద్
08 September 2022, 22:00 IST
- Liquor Shops Close in Hyderabad : వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రెండు రోజులు వైన్ షాపులు మూతపడననున్నాయి.
వైన్ షాపులు బంద్
హైదరాబాద్ తోపాటుగా తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం గణేష్ నిమజ్జనం జరగనుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్స్, కల్లు, దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయి.
మరోవైపు వినాయక నిమజ్జనం సందర్భంగా 9వ తేదీన అంటే శుక్రవారం రోజున.. సెలవు దినంగా ప్రకటించింది ప్రభుత్వం. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాల్లో సెలవు అమల్లో ఉంటుందని తెలిపింది. శుక్రవారం భారీ ఎత్తున వినాయక నిమజ్జన కార్యక్రమం జరగనుంది. దీంతో ఆ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఇతర జిల్లాల ప్రాంతాలకు సైతం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆ రోజున ట్రాఫిక్ ఆంక్షలు సైతం ఉన్నాయి. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లాలంటే.. విద్యార్ధులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ కారణంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు.
ఇంకోవైపు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 22 క్రేన్లు ఏర్పాటు చేశారు. వ్యర్థాల వెలికితీతకు 20 జేసీబీలను సైతం తెప్పించారు. సాగర్ పరిసర ప్రాంతాల్లో 12 వేల మంది పోలీసులతో బందోబస్తు ఉంటారు. శోభాయాత్ర మార్గంలో అత్యవసర సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. పాతబస్తీలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు ఉంటుంది.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనసందోహంగా మారటం ఖాయం. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లోని ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు, బుద్ధ భవన్ వెనుకవైపు, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్ట మైసమ్మ గుడి, లోయర్ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, ఐమాక్స్ పక్కన వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుందని నగర పోలీసులు ప్రకటించారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గాన్ని పోలీసులు విడుదల చేశారు. ఊరేగింపు మార్గాలు, ఇతర వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉ.6 గంటల నుంచి శనివారం ఉ.10 గంటల వరకు ఇతర వాహనాలను అనుమతించబోరు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన లారీలను శుక్రవారం ఉదయం నుంచి 24 గంటలు నగరంలోకి రానివ్వరు.