Ganesh Immersion In Hyderabad : గణేశ్ నిమజ్జనం కోసం ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Hyderabad Ganesh Immersion 2022 Route Map : భాగ్యనగరంలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గణేష్ విగ్రహాల నిమజ్జనం శుక్రవారం ఘనంగా జరగనుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో సెప్టెంబరు 9, 10న ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. చివరి రోజున రోడ్లపై రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు కోరారు. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకూ.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
బాలానగర్, జీడిమెట్ల నుంచి బహదూర్‌పల్లి, బాచుపల్లి, గండిమైసమ్మ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను బౌరంపేట, గండిమైసమ్మ సమీపంలోని సూరారం మీదుగా పంపిస్తారు. గండిమైసమ్మ, బాచుపల్లి నుంచి జీడిమెట్ల, బాలానగర్ వైపు వెళ్లే వాహనాలు బహదూర్‌పల్లి జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి దూలపల్లి జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దుర్గం చెరువులో నిమజ్జనాల కోసం మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి.
ఫతేనగర్ ఫ్లైఓవర్, సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం 45 ఫ్లై ఓవర్ పై వినాయక విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలకు అనుమతి లేదు. దుర్గం చెరువు వంతెన, బాలానగర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్, మల్కంచెరువు ఫ్లైఓవర్, కైతలాపూర్ ఫ్లైఓవర్, షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పైనా వాహనాలకు అనుమతి ఉండదు.
సంగారెడ్డి, పటాన్‌చెరు, బీహెచ్ఈఎల్ నుంచి కూకట్‌పల్లి, హైదరాబాద్ సిటీ వైపు వెళ్లే భారీ వాహనాలకు అనుమతి ఉండదు. బీహెచ్ఈఎల్ ఎక్స్ రోడ్డు నుంచి యూ టర్న్ తీసుకొని లింగంపల్లి, హెచ్ సీయూ, గచ్చిబౌలి, టోలిచౌకి వైపు వెళ్లాలి. బీహెచ్ఈఎల్, చందానగర్, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వైపు వచ్చే అన్ని భారీ వాహనాలు మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద మళ్లింపు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్లి.. బాచుపల్లి, దుండిగల్ రహదారి మీద నుంచి ఉంటుంది. గచ్చిబౌలి, పటాన్‌చెరు నుంచి అరామ్‌ఘర్, అత్తాపూర్ వైపు వచ్చే హెవీ గూడ్స్ వాహనాలు హిమాయత్ సాగర్ వద్ద దిగొద్దు. ORR శంషాబాద్ వద్ద దిగాల్సి ఉంటుంది.
మరోవైపు కేశవగిరి నుంచి చాంద్రాయణ గుట్ట మీదుగా ఫలక్ నామా, ఆలియాబాద్, నాగల్‌చింత, చార్మినార్, అప్జల్ గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్, అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ వైపు విగ్రహాల ఊరేగింపు వెళ్తొంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలేమో రాష్ట్రపతి రోడ్డు, కర్బలా మైదానం, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా వస్తాయి. లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులోకి వెళ్తాయి.
హైదరాబాద్ తూర్పు మండలం నుంచి.. వచ్చే విగ్రహాలు ఉప్పల్, రామాంతపూర్, ఛే నంబర్, దుర్గాభాయ్ దేశ్ ముఖ్ ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ మీదుగా వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ప్రధాన ఊరేగింపులోకి వెళ్తాయి. దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలు ఐఎస్‌సదన్, సైదాబాద్, చంచల్‌గూడ మీదుగా వచ్చే పెద్ద విగ్రహాల ఊరేగింపులోకి కలుస్తాయి.
కర్బలా మైదాన్, బుద్ధ భవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌లోకి ట్రాఫిక్‌ను అనుమతించరు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యే వరకు ఈ పాయింట్ల వద్ద ట్రాఫిక్ మళ్లిస్తారు. CTO, YMCA, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, ప్యాట్నీ క్రాస్ రోడ్స్, బాటా క్రాస్ రోడ్స్, అడవయ్య క్రాస్ రోడ్స్, ఘస్మండి క్రాస్ రోడ్స్ లో ట్రాఫిక్ మళ్లిస్తారు.