Hyderabad Police : ట్యాంక్ బండ్‌పై గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అరెస్టు
Bhagyanagar Utsav Committee Members Arrest : హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో జరపాలని నెక్లెస్ రోడ్‌లో గణేష్ ఉత్సవ సమితి బైక్ ర్యాలీ చేపట్టింది. ఇది కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పోలీసులు ఉత్సవ సమితి సభ్యులను అరెస్టు చేశారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులను మంగళవారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సభ్యులు ట్యాంక్ బండ్‌పై బైక్ ర్యాలీకి ప్రయత్నించారు. హుస్సేన్‌సాగర్ సరస్సులో గణేష్ విగ్రహాల నిమజ్జనం నిర్వహించాలని డిమాండ్ చేశారు. బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు ఉత్సవ నిర్వాహకులకు నడుమ వాగ్వాదం, తోపులాట జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావుతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు ఆరోపించారు. తాము తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చామని, ఈ క్రమంలో పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సరస్సులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో రూపొందించిన గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతినిచ్చేందుకు గతేడాది తెలంగాణ అధికారులకు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. బైక్ ర్యాలీకి అనుమతి కోరుతూ తమకు ఎలాంటి దరఖాస్తు రాలేదని సోమవారం హైదరాబాద్ నగర పోలీసులు తెలిపారు. 'అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున, ఈ ప్రాంతంలో సమూహాలు ఉండకూడదని నిషేధం ఉంది.' అని పోలీసులు తెలిపారు.
'ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం చట్టవిరుద్ధం. సిటీ పోలీస్ చట్టం ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరి. ఏదైనా ఉల్లంఘిస్తే.. చర్యలు ఉంటాయి. ఇంకా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అసెంబ్లీ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.' అని పోలీసులు చెబుతున్నారు.
ఈ నెల 9వ తేదీన గణేష్ నిమజ్జనం నిర్వహించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయం తీసుకుంది. అనంత చతుర్దశి కారణంగా శుక్రవారమే నిమజ్జనం చేయాలని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు అన్నారు. అయితే కొంతమంది, పోలీసులు 9వ తేదీ నిమజ్జనం లేదని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వాట్సాప్ లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
సంబంధిత కథనం