TS ASSEMBLY : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..-telangana assembly three days session starts from tuesday ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

TS ASSEMBLY : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

B.S.Chandra HT Telugu
Sep 06, 2022 09:50 AM IST

తెలంగాణ శాసన సభ,శాసన మండలి సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30కి ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (tsassembly)

తెలంగాణ శాసన సభా సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శాసన సభ, శాసన మండలి సమావేవాలను ఉదయం 11.30కు ప్రారంభిస్తారు.దాదాపు ఆర్నెల్ల తర్వాత శాసనసభా సమావేశాలు జరుగుతుండటంతో అధికార, విపక్షాలు సమావేశాలపై దృష్టి సారించాయి. తొలిరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉండదు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించనుంది. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్‌ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్ధన్‌ రెడ్డిలకు సంతాపం అనంతరం సభ వాయిదా పడనున్నది. శాసనమండలిలో తొలిరోజు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాలపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు.

అనంతరం మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనున్నది. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చించాలి వంటి అంశాలపై బీఏసీలో నిర్ణయించనున్నారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రాత్సవాల సందర్భంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగా మండలి, శాసనసభల్లో విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నది. దళితబంధును ప్రస్తుతం నియోజక వర్గాలవారీగా అందచేస్తున్న 100 కుటుంబాలకు అదనంగా మరో 500 మందికి ఈ పథకాన్ని విస్తరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపైనా సమావేశాల్లో చర్చ జరిగే అవకాశాలున్నాయి.

ఈ నెల 6,12,13 తేదీల్లో మూడో విడతల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశంలో తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో పురపాలక చట్టసవరణ బిల్లుతో పాటు ఆరు బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు శాసనసభ సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌ కూడా రాష్ట్రంలో జరుగతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ వివక్ష, విభజన హామీల అమలులో వైఫల్యం, కొత్త ప్రాజెక్టుల మంజూరులో నిర్లక్ష్యంపై తమ బాణీ వినిపించేందుకు సిద్దమవుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ప్రాధాన్యం అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడిగా చర్చలు జరిగే అవకాశాలున్నాయి.

అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలు, అధిక వర్షాలతో వాటిల్లిన నష్టం, పోడుభూములు, శాంతి భద్రతల సమపస్యలు, ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. శాసనసభా సమావేశాలను వీలైనంత ఎక్కువ రోజులు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను శాసనసభ నుంచి బహిష్కరించాలని, ఆ‍యనపై అనర్హత వేటు వేయాలని ఎంఐఎం పార్టీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసింది.

IPL_Entry_Point