TRS: బీజేపీకి బిగ్ షాక్… టీఆర్ఎస్ లోో చేరిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు
హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న వేళ బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్‌ఎంసీకి చెందిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
bjp corporators join in trs party: హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీకి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్ర పార్టీ నేతలు బిజీబిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే మరోవైపు జీహెచ్ఎంసీకి చెందిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లు... పార్టీ కండువా మార్చారు. గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
పార్టీ మారింది వీరే....
జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు భానోత్ సుజాతా నాయక్ (హస్తినాపురం), పొడవు అర్చన ప్రకాశ్ (రాజేంద్రనగర్), డేరంగుల వెంకటేశ్ (జూబ్లీ హిల్స్), సునీతా ప్రకాశ్‌గౌడ్ (అడిక్‌మెట్) మంత్రి కేటీఆర్‌తో నందినగర్‌లోని నివాసంలో గురువారం భేటీ అయ్యారు. అనంతరం కార్పొరేటర్లకు పార్టీ కండువాలు కప్పి మంత్రి కేటీఆర్ వారిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. వీరితో పాటు తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ కూడా అధికార పార్టీలోకి చేరారు.
ఈ చేరికల కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఉన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు, ఇద్దరు కో–ఆప్షన్ సభ్యులు కూడా కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.