తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Weather Updates: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు..వడగాళ్ల వానలు

TS Weather Updates: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు..వడగాళ్ల వానలు

HT Telugu Desk HT Telugu

28 April 2023, 11:31 IST

    • TS Weather Updates: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

TS Weather Updates: రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో దిగువ స్థాయిలో గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొంది. ఉపరితలానికి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో చాలాచోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

TS DOST Registration 2024 : డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు, ప్రారంభమైన 'దోస్త్' రిజిస్ట్రేషన్లు - ఇలా ప్రాసెస్ చేసుకోండి

US Indian Student Missing: అమెరికాలో తెలంగాణ విద్యార్ధి అదృశ్యం, మే2 నుంచి అదృశ్యమైన రూపేష్ చింతకింది

Graduate Mlc election: వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎటు వైపు? మూడు పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

Nalgonda Ellayya Murder: దొరికిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడి డెడ్ బాడీ.. అంత్యక్రియలు పూర్తి

గురువారం రాత్రి నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిశాయి. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఈ నెల 30, మే ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు. క్యుములో నింబస్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 36.8, భద్రాచలంలో 36.6, హనుమకొండలో 33, హైదరాబాద్‌లో 32.7, ఖమ్మంలో 36.6, మెదక్‌లో 32.6, నల్లగొండలో 37, నిజామాబాద్‌లో 35.2, రామగుండంలో 36.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. గురువారం అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మొగ్దుంపల్లెలో 9.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జహీరాబాద్‌ మండలంలో 6.4, కోహిర్‌లో 4.5 సె.మీ., నల్గొండ జిల్లా త్రిపురారంలో 3.7 సె.మీ. కురిసింది. దాదాపు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి.

గురువారం పగటి పూట మెదక్‌లో సాధారణం కన్నా 8.7 డిగ్రీలు తగ్గి 32.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఆదిలాబాద్‌, హనుమకొండ, మెదక్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ రాత్రిపూట చలి వాతావరణం నెలకొంటోంది. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లోనూ పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ నెల 30, మే నెల ఒకటిన కొన్నిచోట్ల పగటి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.