తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana High Court Serious On Officers Over Only Toilet For 700 Students In Saroornagar Junior College

High Court : 700 మంది విద్యార్థినులకు ఒకే టాయిలెట్.. అధికారులపై హైకోర్టు ఆగ్రహం

HT Telugu Desk HT Telugu

03 March 2023, 7:46 IST

    • High Court : హైదరాబాద్ సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 700 మంది విద్యార్థినులకు ఒకే టాయిలెట్ ఉండటంపై.. రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్న ఆ ఒక్కటీ సరైన నిర్వహణలో లేకపోవడంతో అధికారుల తీరుపై సీరియస్ అయింది. ఈ అంశంలో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన ధర్మాసనం.. ఉన్నతాధికారులకి నోటీసులు జారీ చేసింది.
సరూర్ నగర్ కాలేజీపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
సరూర్ నగర్ కాలేజీపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

సరూర్ నగర్ కాలేజీపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

High Court : ప్రభుత్వ విద్యా నిలయాల్లో వసతులు అంతంత మాత్రమే. సౌకర్యాల కోసం విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్ యూనియన్ లు ఎన్ని సార్లు డిమాండ్ చేసినా.. ఆశించినంత మార్పు రావడం లేదు. ఆందోళనలు ఉద్ధృతంగా జరిగినప్పుడు కంటితుడుపు చర్యలతోనే సరిపెడుతున్నారు అధికారులు. దీంతో... సర్కారీ స్కూళ్లు, కాలేజీల్లో కనీస సౌకర్యాల లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా.. విద్యార్థినుల బాధలైతే.. వర్ణనాతీతం. రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలలు, కాలేజీల్లో టాయిలెట్లు కూడా సరిపడినన్ని లేవు. ఉన్న కొన్నింటి నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంలో గతంలో అనేక సార్లు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర హైకోర్టు... తాజాగా మారోసారి అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేసింది. 700 మంది విద్యార్థినులకు ఒకే ఒక్క టాయిలెట్ ఉండటం.. అది కూడా సరిగా పనిచేయకపోవడంపై సీరియస్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

హైదరాబాద్ సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒకే ఒక్క టాయిలెట్ ఉండటం.. దాని నిర్వహణ కూడా సరిగా లేక పోవడం గురించి పత్రికల్లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని.. దీంతో చాలా మంది విద్యార్థినులు తరగతులకు రావడం లేదని.. వారు నిరసన తెలిపినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. కళాశాలలో 700 మంది విద్యార్థినులకు సరిపడా టాయిలెట్స్.. తాగునీరు.. ఇతర సౌకర్యాల కల్పనపై మూడు నెలలుగా డిమాండ్లు చేస్తున్నా... వారి బాధలు వినే వారే కరవయ్యారు. ఉన్న ఒక్క టాయిలెట్ ను అంత మంది విద్యార్థినులు ఉపయోగిస్తుండటంతో... ఇన్ ఫెక్షన్లు సోకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నా... అధికారులు పట్టించుకోవడం లేదు. పరిస్థితులకు భయపడి కొంత మంది విద్యార్థినులు నెలసరి సమయంలో కళాశాలకు రావట్లేదు. కొంత మంది నీరు కూడా తాగడం లేదు.

విద్యార్థినుల ఈ దుస్థితిని వివరిస్తూ.. ఎల్ఎల్బీ విద్యార్థి మణిదీప్ రాష్ట్ర హైకోర్టుకి లేఖ రాశారు. దీనిని సుమోటోగా తీసుకున్న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దాదాపు 700 మంది విద్యార్థినులన్న కళాశాలలో ఒకే ఒక్క టాయిలెట్ ఉండటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్న ఆ ఒక్కటీ సరైన నిర్వహణలో లేకపోవడంతో అధికారుల తీరుపై సీరియస్ అయింది. ఈ అంశంలో పూర్తి నివేదిక ఇవ్వాలని ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కమిషనర్, ఇంటర్ బోర్డు, సరూర్ నగర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే... రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలు, పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రలీగల్ సర్వీసెస్ అథారిటీని సైతం ఈ పిటిషన్ లో ప్రతివాదిగా చేర్చింది.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.

టాపిక్