TS HC On Republic Day: కొవిడ్ సాకుగా చూపి గణతంత్ర వేడుకలను ఆపడం సరికాదు
25 January 2023, 16:20 IST
- TS High Court On Republic Day Celebrations: గణతంత్ర వేడుకల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. వేడుకలు కచ్చితంగా జరపాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గణతంత్ర వేడుకలపై హైకోర్టు ఆదేశాలు
Republic Day Celebrations in Telangana: తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ మేరకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలు జరపాలని ఆదేశించింది. గణతంత్ర వేడుకలపై కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్ పాటించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తెలిపింది. గురువారం జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాటు త్వరగా చేయాలని చెప్పింది. కొవిడ్ 19 సాకుగా చూపి వేడుకలను ఆపడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించింది.
గవర్నర్ కామెంట్స్..
మరోవైపు గణతంత్ర వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. కరోనా పేరుతో వేడుకలు జరపకపోవడం బాధాకరమని వాపోయారు. ఫలితంగా రాజ్‌భవన్‌లోనే ఈ గణతంత్ర వేడుకలకు గవర్నర్ జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అయితే వేడుకల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో... ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. అయితే ఈ వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారా..? లేదా..? అనేది రాజ్ భవన్ వర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంటుంది.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజశ్వర్ రెడ్డి... గవర్నర్ తీరు సరికాదన్నారు. గవర్నరే ఇబ్బందులు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. వర్శిటీల్లో నియమాకాల కోసం తీసుకువచ్చిన బిల్లుకు ఆమోదం తెలపకుండా ఇబ్బంది పెడుతున్నారని కామెంట్స్ చేశారు. గణతంత్ర వేడుకలను ఎలా నిర్వహించాలో తమ ప్రభుత్వానికి తెలుసని అన్నారు. ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటిస్తామని... అయితే గవర్నర్ కి బీజేపీ ప్రొటోకాల్ కావాలని అనుకుంటున్నారేమో అంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా గత కొంత కాలంగా గవర్నర్ వర్సెస్ గవర్నర్ మెంట్ అన్నట్లు పరిణామాలు కొనసాగుతున్నాయి. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల విషయంలో కూడా గవర్నర్ అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో… మరోసారి చర్చనీయాంశంగా మారింది.