Telangana Governor: ప్రభుత్వంపై గవర్నర్ మరోసారి ఆరోపణలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ను పాటించడం లేదని తెలంగాణ గవర్నర్ మరోసారి ఆరోపించారు
హైదరాబాద్, జనవరి 19: తన కార్యాలయానికి సంబంధించి ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని, గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రభుత్వం నుండి తనకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆరోపించారు.
బుధవారం ఖమ్మం పట్టణంలో జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో గవర్నర్‌లు, కేంద్రం రాజ్‌భవన్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారంటూ నేతలు చేసిన వ్యాఖ్యలను ఈరోజు గవర్నర్ వద్ద విలేకరులు ప్రస్తావించగా, రాజకీయ పరిస్థితులపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదన్నారు. కానీ గవర్నర్లు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారని అన్నారు.
అయితే కొన్నిసార్లు తెలంగాణలో మాదిరిగానే గవర్నర్లపై వివక్షతో కూడిన చర్యలు ఉంటున్నాయని ఆమె ఆరోపించారు. ఆమె తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నట్టు తెలిపారు. తన వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అంగీకరించారు. వాటిని విశ్లేషించాల్సి ఉందని ఇప్పటికే చెప్పానని ఆమె గుర్తు చేశారు.
‘తెలంగాణ తరహాలో ఒక్కోసారి గవర్నర్లకు వ్యతిరేకంగా పక్షపాత చర్యలు జరుగుతున్నాయి.. నేను బహిరంగంగా చెప్పగలను. నేను దేనినీ వ్యతిరేకించడం లేదు. నేను నా డ్యూటీ చేస్తున్నాను. కొన్ని బిల్లులు ఉన్నాయి. వాటిని అంచనా వేయాలి. విశ్లేషించాలి..’ అని రాజ్‌భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులతో అన్నారు.
తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తన విషయంలో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని ఆమె అన్నారు. ‘ఎటువంటి ప్రోటోకాల్‌ను అనుసరించలేదు. ఇప్పటివరకు, గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి మాకు ఎటువంటి సందేశం రాలేదు’ అని ఆమె అన్నారు. గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించాలని, రాష్ట్రంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని గవర్నర్ ప్రశ్నించారు.
‘ఒకే ప్రశ్న, పదే పదే అడుగుతున్నాను. ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదు. దీనికి సమాధానం చెప్పనివ్వండి’ అని గవర్నర్ అన్నారు. చాలా కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయమై ప్రస్తావించగా, తాను దానిపై ఇప్పటికే సమాధానం ఇచ్చానని, ప్రోటోకాల్ సమస్య గత ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉందని అన్నారు.
బీజేపీ చెప్పినట్లే గవర్నర్లు నడుచుకున్నారనే ఆరోపణలపై ఆమె స్పందిస్తూ.. తాను జిల్లాల పర్యటనలో కలెక్టర్లు ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సమాధానం చెప్పాలని అన్నారు. గవర్నర్లు బాధ్యతాయుతమైన వ్యక్తులని, ఏమి చేయాలో చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
రాజ్ భవన్, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు లేవు. సౌందరరాజన్ గతంలో జిల్లాల పర్యటనలలో ప్రోటోకాల్ పాటించలేదని ఫిర్యాదు చేశారు. గత నవంబర్‌లో తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు గవర్నర్ అనుమానాలు వ్యక్తం చేశారు.