Telangana: రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్… అసలు తాజా వివాదమేంటి..?-telangana govt and governor latest contraversory over assembly bills issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Govt And Governor Latest Contraversory Over Assembly Bills Issue

Telangana: రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్… అసలు తాజా వివాదమేంటి..?

HT Telugu Desk HT Telugu
Nov 10, 2022 08:08 AM IST

Governor Vs Government: కొద్దిరోజుల కిందట తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదం పొందిన 8 బిల్లుల్లో కేవలం ఒక్క బిల్లుకు మాత్రమే ఆమోదం లభించింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు మాత్రమే చట్టరూపం దాల్చగా... మరో 7 బిల్లులు రాజ్‌భవన్‌లోనే పెండింగులో ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఇదీ కాస్త… రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లు మారిపోయింది.

గవర్నర్ - ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఫొటో)
గవర్నర్ - ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఫొటో) (twitter)

Raj bhavan Vs Pragati bhavan: రాజ్ భవన్... ప్రగతి భవన్..... గత కొద్దిరోజుల కిందట చర్చ అంతా దీని చుట్టే...! ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వంపై సూటిగా విమర్శలు గుప్పిస్తున్నారు గవర్నర్ తమిళిసై..! వరదల విషయంలోనూ ముఖ్యమంత్రి ఓవైపు... గవర్నర్ మరోవైపు పర్యటనలు కూడా చేశారు. చాలారోజులుగా ఇరువురి మధ్య గ్యాప్ పెరిగిందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అనంతరం జరిగిన పరిణామాలు కూడా వాటిని బలపరిచాయి. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చేసింది. అదే బిల్లుల ఆమోద ప్రక్రియ..! తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా... పక్కనపెట్టారని ప్రభుత్వం తెరపైకి తీసుకువస్తోంది. ఇందులో ఓ బిల్లు కీలకంగా ఉండటం, విద్యాశాఖమంత్రికి గవర్నర్ లేఖ రాయడం వంటివి జరిగాయి. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ... మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయటంతో వివాదం కాస్త మరింత ముదిరినట్లు అయింది.

బిల్లులేంటి..?

తెలంగాణ శాసనసభ, మండలిలో ఎనిమిది బిల్లులు ఆమోదం పొందాయి. అందులో రెండు కొత్తవి ఉన్నాయి. మిగతా 6 చట్ట సవరణకు సంబంధించినవి ఉన్నాయి. వర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్పు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా.. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్టం, అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటి ఆమోదం అనంతరం మరుసటి రోజున నిబంధనల మేరకు రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్‌ వాటిని పరిశీలించి ఆమోదించాక.. గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. అప్పుడు అవి చట్టరూపం పొంది అమల్లోకి వస్తాయి. సాధారణంగా వారం, పది రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం ఎనిమిది బిల్లులకుగాను ఒక్క జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్‌ ఆమోదం లభించింది. మిగిలిన 7 బిల్లులకు ఆమె నుంచి ఆమోదం రావాల్సి ఉంది.

కీలకమైన బిల్లు ఇదే...

రాజ్‌భవన్‌లో పెండింగులో ఉన్న బిల్లుల్లో కీలకమైనది వర్శిటీల్లో నియమాకాలకు సంబంధించనది. 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉమ్మడి నియామక బోర్డు ద్వారా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదముద్ర వేస్తే... సంబంధిత ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అనూహ్యంగా గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయలేదు. పైగా ఈ బిల్లుకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని... క్లారిటీ ఇవ్వాలంటూ రాష్ట్ర విద్యాశాఖమంత్రికి లేఖ రాశారు. ఈ పరిణామాలపై అధికార టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. కీలకమైన నియమాకాలకు సంబంధించిన బిల్లును ఆపడమేంటని ప్రశ్నిస్తోంది. కావాలనే గవర్నర్ ఇలా చేస్తున్నారని ఆరోపిస్తోంది.

అందుకే అడిగా....

బుధవారం మీడియాతో మాట్లాడిన గవర్నర్ తమిళిసై.... ఈ వ్యవహరంపై స్పందించారు. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒక్కో బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు. కొత్త రిక్రూట్’మెంట్ బోర్డు అంశంలో క్లారిటీ కావాలని అడిగానని వివరించారు. దానికి నేనేదో బిల్లును ఆపానని ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. కొత్తగా రిక్రూట్‌మెంట్ బోర్డు పెడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది తన సందేహమని అన్నారు. తెలంగాణకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే తాను క్లారిఫికేషన్ అడిగానని అన్నారు. ఈ విషయంలో మంత్రి అవగాహన లేకుండా మాట్లాడారని కామెంట్ చేశారు. యూనివర్సిటీల పరిస్థితులు కళ్లారా చూశానని వ్యాఖ్యానించారు.

బిల్లులకు ఆమోదముద్ర పడకపోడవం, తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంటూ గవర్నర్ వ్యాఖ్యలు చేయటంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఎపిసోడ్ పై సీఎం కేసీఆర్ స్పందిస్తారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point