గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) వివాదం నడుస్తోంది. తాజాగా బిల్లలు విషయంపై చర్చ నడుస్తోంది. గవర్నర్ తమిళిసై లేఖపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందన్నారు. గవర్నర్(Governor)ను కలవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. గవర్నర్‌ను కలిసి లేఖపై సందేహాలు నివృత్తి చేస్తానని స్పష్టం చేశారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరామన్నారు. ఇంకా కన్ఫామ్ కాలేదన్నారు.
గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) అపాయింట్‌మెంట్ ఇస్తే కలుస్తానని మంత్రి సబితా చెప్పారు. యూనివర్సిటీల్లో ఖాళీల నియామకానికి ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గవర్నర్ తమిళిసై దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత తెలంగాణ(Telangana) ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజ్ భవన్(Raj Bhavan)లో పెండింగ్‌లో పలు బిల్లులు ఉన్నాయి. వాటిపై చర్చించేందుకు రాజ్ భవన్‌కు రావాలని యూజీసీ(UGC), విద్యాశాఖకు గవర్నర్ తెలిపారు. ఈ నెల 7న ప్రభుత్వానికి తమిళి సై లేఖ కూడా రాశారు. ఈ బిల్లుపై ఉన్న అభ్యంతరాలపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆమె అన్నారు. ప్రభుత్వ తీరుపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అంశంపై యూనివర్సిటీల విద్యార్థీ జేఏసీ రాజ్‌భవన్ ముట్టడికి పిలుపును కూడా ఇచ్చింది. మరోవైపు ప్రధాని మోదీ(PM Modi) తెలంగాణ పర్యటన కూడా అడ్డుకుంటామని అంటోంది.
గవర్నర్ వద్ద ఉన్న బిల్లులు..
తెలంగాణ(Telangana) ఉభయ సభలు ఆమోదించిన బిల్లులు గవర్నర్ దగ్గర ఆమోదం కోసం ఉన్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు, ములుగు అటవీకళాశాల(Forest College), పరిశోధానా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయి మెంట్ తదితర బిల్లులు ఉన్నాయి.