Telangana DGP : ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు - డీజీపీ జితేందర్
22 December 2024, 14:04 IST
- సంథ్య థియేటర్ ఘటనపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు కానీ పరిస్థితులను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదన్నారు.
తెలంగాణ డీజీపీ జితేందర్(ఫైల్ ఫొటో)
ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదని తెలంగాణ డీజీపీ జితేందర్ వ్యాఖ్యానించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సంథ్య థియేటర్ ఘటనపై స్పందించారు. తాము వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకం కాదని… పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు.
ఆయన హీరో కావొచ్చు కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలని డీజీపీ వ్యాఖ్యానించారు. చట్టప్రకారమే తాము యాక్షన్ తీసుకున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదన్నారు. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదని స్పష్టం చేశారు.
మరోవైపు సినీ నటుడు మోహన్‌బాబు వ్యవహారంపై కూడా డీజీపీ జితేందర్ స్పందంచారు. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో.. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ ఫైర్...
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఈనెల 4న సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ఈ అంశంపై అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి స్పందింస్తూ…. సంధ్య థియేటర్‌కు వెళ్లేందుకు ఒక్కటే దారి ఉందని, అక్కడికి రావొద్దని పోలీసులు చెప్పినా హీరో అల్లు అర్జున్ లెక్కచేయకుండా వచ్చారని సీఎం తెలిపారు.
హీరో అల్లు అర్జున్ ఒక రోజు జైలుకు వెళ్లి వస్తే హీరోలు, నిర్మాతలు, సినిమా వాళ్లు వెళ్లి పరామర్శించారన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారిని చూసేందుకు ఒక్కరూ కూడా ఆసుపత్రికి వెళ్లలేదన్నారు. ఒకపూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్లు చేతులు పోయిన మనిషిని చూడటానికి వెళ్లినట్లు వెళ్లారని మండిపడ్డారు. ఓ మహిళ ప్రాణం పోయిందని, ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.
మరోవైపు సీఎం వ్యాఖ్యల తర్వాత అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ పేరు ప్రస్తావించకుండానే.. కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాటపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. రోడ్ షో చేసుకుంటూ వెళ్లామనడం సరికాదన్నారు.
అనుమతి లేకుండా వెళ్లామన్నది తప్పుడు ఆరోపణ అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో తనకు ఎలాంటి వివాదం లేదన్నారు. సినిమా ఇంత పెద్ద హిట్టు అయినా... ఆ సక్సెస్ ను ఆస్వాదించలేకపోతున్నానన్నారు. 15 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని అన్నారు. తొక్కిసలాట గురించి మరుసటి రోజే తనకు తెలిసిందన్నారు.
అల్లుఅర్జున్ కు బాసటగా బండి సంజయ్:
అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవల్ లో కథ అల్లి మళ్లీ సమస్యను స్రుష్టించడం సిగ్గు చేటన్నారు.
ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అన్న బండి సంజయ్… గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందన్నారు. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ కు అదే గతి పడుతుందని దుయ్యబట్టారు. గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీకో న్యాయం ఇతరులకు ఒక న్యాయమా? అని నిలదీశారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలని హితవు పలికారు.
అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదని ఏపీ బీజేపీ ఎంపీ పురందేశ్వరి అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదన్న ఆమె.... అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పారు. ఈ కేసులో ఇతరులను అరెస్ట్ చేయకుండా, A11గా ఉన్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు.