KCR Hoardings in Gujarat | మోదీ ఇలాఖాలో కేసీఆర్ హోర్డింగ్‌లు.. ఎందుకో తెలుసా?
16 February 2022, 18:06 IST
- తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను తెరాస శ్రేణులు భారీఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని, సూరత్ నగరంలో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ హోర్డింగ్స్ వెలిశాయి.

Telangana CM KCR hoarding in Surat, Gujarat
Surat | తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను తెరాస శ్రేణులు భారీఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా భారీ కటౌట్లు, హోర్డింగులు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు నేతలు, అభిమానులు. అయితే తెలంగాణ రాష్ట్రానికి దూరంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఇలాఖా అయిన గుజరాత్ రాష్ట్రంలో కూడా కేసీఆర్‌కు సంబంధించిన భారీ హోర్డింగ్‌లు ఏర్పాటుచేయడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ భారీ హోర్డింగ్‌లు వెలిశాయి. సూరత్ నగరంలో చాలా చోట్ల ఈ హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్, గాజులరామారంకు చెందిన సాయి అనే వ్యక్తి.. సీఎం కేసీఆర్ మీద తనకున్న అభిమానంతో ఈ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సూరత్‌లోని వృద్ధాశ్రమంలో రెండు రోజుల పాటు అన్నదానం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు చెప్పాడు.
కేసీఆర్ చేసిన ఉద్యమ పోరాటాలు.. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేస్తున్న కృషి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల వారికీ తెలియాలనే ఉద్దేశంతో తాను సూరత్ నగరాన్ని ఎంచుకున్నట్లు సాయి స్పష్టం చేశాడు.
Check below picture:
సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైన వేళ, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్ధతు కూడగడుతున్న సందర్బంలో తెలంగాణ సీఎంకు సంబంధించిన హోర్డింగ్స్ గుజరాత్‌లో వెలియడం ఆసక్తిని రేకేత్తిస్తోంది. తెలంగాణ సంక్షేమ పథకాలను మోదీ గుజరాత్‌లో కాపీ కొట్టుకొని అవి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని తెరాస నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సైతక శిల్పం
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఒడిశాలోని పూరీ బీచ్ వద్ద సీఎం కేసీఆర్ భారీ సైకత శిల్పాన్ని ఆయన రూపొందించారు. దానిపైన 'పోరాట యోధుడు, పాలనాదక్షుడు, దూరదృష్టి గల నేత - హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్' అని రాసి ఉంది. ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన సీఎం కేసీఆర్ సైకత శిల్పం అక్కడి జనం దృష్టిని ఆకర్శిస్తోంది.