కేసీఆర్ జన్మదిన్నాన్ని 'నిరుద్యోగ దినం'గా జరుపుతాం.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
17 February 2022, 18:32 IST
- సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తనను అరెస్ట్ చేయండపై ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ డిమాండ్ చేస్తూ అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయాలని టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Telangana PCC Chief Revanth Reddy
Hyderabad | సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తనను అరెస్ట్ చేయండపై ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ జన్మదినం ప్రతిపక్ష నేతలకు జైలుదినం కావాలా? నిరుద్యోగుల తరపున ప్రశ్నించడమే మేం చేసిన నేరమా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ తన నీడను చూసినా భయపడుతున్నారన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ వేడుకలు జరుపుకోవడం అవసరమా..? ఉద్యోగ నోటిఫికేషన్లు అడగడం నేరమా? ప్రముఖులు చనిపోతే సంతాప దినాలు జరుపుతారు.. బ్రతికి ఉన్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు 3 రోజులు జరపడమేంటి? అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 17ను నిరుద్యోగ దినంగా జరుపుతామంటూ రేవంత్ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉత్ప్రేరకమే విద్యార్థులు, నిరుద్యోగులే. అటెండర్ నుండి ఐఏఎస్ వరకు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం అన్నాడు కేసీఆర్, కానీ 8 ఏళ్లైనా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక కూడా నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారని, పీజీలు చదివినవారు సైతం హమాలీలుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అయితే కేసీఆర్ కుటుంబం మాత్రం వేలకోట్ల రూపాయలు, వందల కొద్దీ ఎకరాలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ తీరు చూస్తుంటే నక్సలైట్లు ఉంటేనే బాగుండు అనిపిస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ డిమాండ్ చేస్తూ అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయాలని టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇక పోలీసుల తీరుపైనా రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై టీఆరెస్ నేతలు పాశవిక దాడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రభుత్వ నేతలకు బానిస బతుకులు బతుకుతున్నారు.. డీజీపీకి సిగ్గులేదా? అంటూ రేవంత్ తీవ్రంగా స్పందించారు. చేతగాని డీజీపీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక బానిస అధికారుల సంగతి తేలుస్తాం అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.