తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Set Exam : టీఎస్ సెట్ పరీక్ష రీషెడ్యూల్.. వారికి మార్చి 17న ఎగ్జామ్

TS SET Exam : టీఎస్ సెట్ పరీక్ష రీషెడ్యూల్.. వారికి మార్చి 17న ఎగ్జామ్

HT Telugu Desk HT Telugu

07 March 2023, 20:53 IST

    • TS SET Exam : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన టీఎస్ సెట్ పరీక్షను అధికారులు రీషెడ్యూల్ చేశారు. మార్చి 13న జరగాల్సిన పరీక్షను మార్చి 17న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 10 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ సెట్ పరీక్ష రీషెడ్యూల్
తెలంగాణ సెట్ పరీక్ష రీషెడ్యూల్

తెలంగాణ సెట్ పరీక్ష రీషెడ్యూల్

TS SET Exam : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిన టీఎస్ సెట్ పరీక్ష తేదీని అధికారులు రీషెడ్యూల్ చేశారు. మార్చి 13న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నందున.. ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... ఈ నెల 13న జరగాల్సిన పరీక్షను మార్చి 17న (శుక్రవారం) నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 14, 15 తేదీలలో జరగాల్సిన పరీక్షలను మాత్రం ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు టీఎస్‌ సెట్‌ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ సి.మురళీకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, రీషెడ్యూల్‌ చేసిన ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను మార్చి 10 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ సెట్‌ నిర్వహిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. వివిధ సబ్జెక్టులకు గాను టీఎస్ సెట్ కోసం 50 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. పరీక్షల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాలు... ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కంప్యూటర్‌ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే టీఎస్‌ సెట్‌కు రెండు పేపర్లు ఉంటాయి. పూర్తి వివరాలను www.telanganaset.org వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

2 పేపర్లు.. 3 గంటలు

కంప్యూటర్ ఆధారితంగా (Computer based test -CBT) నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 3 గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో.... పేపర్ 1 లో 50 ప్రశ్నలకు గాను 100 మార్కులు.. పేపర్ 2 లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. 29 సబ్జెక్టులలో ఈ టెస్ట్ జరుగుతుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు.. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పోస్టుల రిక్రూట్మెంట్ లో పోటీ పడే అవకాశం ఉంటుంది. టీఎస్ సెట్ ను చివరిసారిగా 2019లో నిర్వహించారు. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ కు సంబంధించి హాల్‌టికెట్లను మార్చి 1న అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పేపర్ 1 లో చూస్తే... జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1) ఉంటుంది. రెండో పేపర్ పూర్తిగా ఎంపిక చేసుకున్న సబ్జెక్టు ఉంటుంది .

సబ్జెక్టులు ఇవే...

జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.సంస్కృతం, సోషల్ వర్క్ సబ్జెక్టులకు సెట్ నిర్వహిస్తున్నారు.