PM Modi Telangana Tour: ఈ నెల 12న తెలంగాణకు ప్రధాని మోదీ - షెడ్యూల్ ఇదే
04 November 2022, 17:36 IST
- PM Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 12న రామగుండంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు ఏపీలోనూ ప్రధాని మోదీ పర్యటిస్తారు.
ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)
గతంలో మూతబడిన రామగుండం ఎఫ్‌సీఐ (ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. కాగా.. గతేడాది మార్చి 22న ఆర్ఎఫ్‌సీఎల్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్టుగా ప్రకటించింది. ఇప్పుడు నరేంద్ర మోదీ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు. ఎన్టీపీసీ టౌన్ షిప్‌లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ వస్తారా..?
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు.. సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుమార్లు తెలంగాణకు మోదీ వచ్చినప్పుడు.. సీఎం స్థాయిలో కేసీఆర్ పాల్గొనలేదు. అందుకు కారణాలు కూడా ప్రభుత్వ వర్గాలతో పాటు టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది. తెలంగాణలోని తాజా పరిస్థితులు, బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో.... కేసీఆర్ హాజరుపై చర్చ నడుస్తోంది. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో.. ప్రధాని పర్యటన ఆసక్తిని రేపుతోంది.
విశాఖ పర్యటనకు మోదీ...
Modi Vizag Tour Schedule : ఇక ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 11, 12వ తేదీల్లో ఏపీలోని విశాఖలోనూ పర్యటించనున్నారు. 10,472 కోట్ల రూపాయల విలువైన ఏడు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు.
ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టాక విశాఖ(Visakha) రావడం మూడోసారి. నవంబర్ 11న సీఎం జగన్(CM Jagan) విశాఖకు చేరుకుంటారు. ప్రధానితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11వ తేదీ రాత్రి 7 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. ఐఎన్ఎస్ డేగా నుంచి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి మోదీ, సీఎం జగన్ వెళ్తారు. ఈఎన్సీ అధికారులతో రక్షణ రంగంపై మాట్లాడతారు. రాత్రి అక్కడే బస ఉంటుంది. నవంబర్ 12వ తేదీన ఉదయం ఏయూ గ్రౌండ్(AU Ground)కి వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఏయూలో జరిగే వేదిక నుంచే కీలక అభివృధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుడతారు. అనంతరం ఏయూ గ్రౌండ్ నుండి మ.2 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధాని ప్రత్యేక విమానంలో దిల్లీ(Delhi) బయల్దేరుతారు.
విశాఖలో దక్షిణ కోస్తా రైల్వేజోన్(Railway Zone) ప్రధాన కార్యాలయ నిర్మాణానికి మోదీ, జగన్ శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ.120 కోట్లతో ఈజోన్ ను నిర్మించే అవకాశం ఉంది. విశాఖ శివారు వడ్లపూడి(Vadlapudi)లోని రైల్వే అనుబంధ సంబందిత సంస్థ ఆర్ఎన్ఎల్ రూ.260 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యాగన్ ను జాతికి అంకితం చేస్తారు. దాదాపు రూ.26 వేల కోట్ల వ్యయంతో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) చేపట్టిన రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుని కూడా ప్రారంభిస్తారు.