తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Goods Train Derails : దామరచర్ల వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు ఆలస్యం!

Goods Train Derails : దామరచర్ల వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు ఆలస్యం!

26 May 2024, 20:29 IST

google News
    • Goods Train Derails : గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో దామరచర్ల సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో పలు రైళ్లు ఆలస్యం నడుస్తున్నాయి.
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు ఆలస్యం!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు ఆలస్యం!

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు ఆలస్యం!

Goods Train Derails : గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. తెలంగాణలోని నల్గొండ దామరచర్ల విష్ణుపురం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి.

పలు రైళ్లు ఆలస్యం

గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తోన్న గూడ్స్‌ రైలు దామచర్ల వద్ద రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో రైలు తక్కువ వేగంలో ఉండటంతో లోకో పైలెట్ చాకచక్యంగా రైలు నిలిపివేశారు. దీంతో మిగతా బోగీలు పడిపోకుండా ట్రాక్ పై నిలిచిపోయాయి. దీంతో గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. జన్మభూమి ఎక్స్ ప్రెస్ పిడుగురాళ్లలో నిలిపివేయగా, శబరి ఎక్స్‌ప్రెస్‌ను మిర్యాలగూడలోనే నిలిపివేశారు. ఎండ ఉక్కపోత, గంటల కొద్ది రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే అధికారులు రైల్వే ట్రాక్ పునురుద్ధరణ పనులు చేపట్టారు. ప్రమాదానికి కారణాలను రైల్వే అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనపై విచారణ చేపడతామని రైల్వే అధికారులు అంటున్నారు.

రైళ్ల షెడ్యూల్ మార్పు

గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దారిమళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మరికొన్ని రైళ్ల సమయాల్లో మార్పులు చేశారు. సికింద్రాబాద్-హౌరా ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైల్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు పగిడిపల్లి-కాజిపేట-వరంగల్-కొండపల్లి-మీదుగా విజయవాడ చేరుకోనున్నాయి. విజయవాడ-లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ గంట ఆలస్యంగా నడుస్తుంది. మిర్యాలగూడలో శబరి ఎక్స్‌ప్రెస్‌, పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ మూడు గంటలకుపైగా నిలిచిపోయాయి.

ఎంఎంటీఎస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు నేపథ్యంలో ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్‌-మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు అయ్యాయి. ఇవే కాకుండా సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య సర్వీసులందించే 4 డెమూ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొన్ని రైళ్లను రెండు రోజుల పాటు(మే 25, 26 తేదీల్లో), మరికొన్నింటిని ఒక్కరోజు రద్దు చేస్తున్నట్లు వివరించింది. మొత్తంగా 26 రైలు సర్వీసులు రద్దు అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు గతేడాదిలోనే శంకుస్థాపన జరిగింది. మొత్తం 719 కోట్ల రూపాయలతో ఈ పనులను చేపట్టారు. విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

జన్మభూమి ఏసీ బోగీల లింక్ కట్

విశాఖపట్నంలో ఇటీవల జన్మభూమి రైలుకు ప్రమాదం తప్పింది. మే 22న ఉదయం ఆరు గంటల 20 నిమిషాలకు విశాఖ నుంచి బయలుదేరిన జన్మభూమి రైలు నుంచి రెండు ఏసీ బోగీల లింకు కట్ అయింది. కొన్ని నిమిషాల తర్వాత ఈ విషయాన్ని అధికారులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది తిరిగి రైలును వెనక్కి రప్పించి లింకును సరి చేశారు. భోగిలో రైలు నుంచి విడిపోవడంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. సాంకేతిక సమస్యతో రెండు బోగీలు రైలు నుంచి విడిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆ సమస్యను పరిష్కరించిన అనంతరం మూడు గంట‌ల ఆల‌స్యంగా రైలు బయలుదేరింది. రైలు ఆలస్యంతో ప్రయాణికులు 2-3 గంటలు స్టేషన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరలేకపోయామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు..

తదుపరి వ్యాసం