తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugode People : మునుగోడు ప్రజలు ఇప్పుడు ఏం అంటున్నారు?

Munugode People : మునుగోడు ప్రజలు ఇప్పుడు ఏం అంటున్నారు?

HT Telugu Desk HT Telugu

17 November 2022, 14:28 IST

    • Munugode People Reaction : మునుగోడు ఉపఎన్నిక ముగిసి చాలా రోజులైంది. టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎన్నికల సందర్భంగా పండగ వాతావరణం ఉన్న మునుగోడు ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు?
మునుగోడు
మునుగోడు

మునుగోడు

మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll) నవంబరు 3న జరిగింది. ఆ తర్వాత ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక ఎన్నికల ముందు నుంచి ప్రధాన పార్టీల నేతలంతా అక్కడే మకాం వేశారు. అందరి చూపే అటువైపే ఉండేది. హోరాహోరీగా సాగిన ప్రచారం, ప్రధాన పార్టీల నేతలతో దాదాపు రెండు నెలల పాటు వ్యవసాయం, చేనేత, నిర్మాణ, ఇతర చిన్నచిన్న పనులకు సంబంధించిన సాధారణ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. మునుగోడు అసెంబ్లీ(Munugdoe Assembly) నియోజకవర్గంలో ప్రజలు ఇప్పుడిప్పుడే మెల్లగా సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు.

నవంబర్ 3 ఓటింగ్ ముగిసిన వెంటనే మునుగోడు నుంచి ఇతర పార్టీల నేతలు బయటకు వచ్చేశారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress), టీఆర్ఎస్(TRS) పార్టీల నేతలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఫలితాలు వెలువడ్డాక ఇక అటువైపు చూడటమే మానేశారు. అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే వరకు టీఆర్ఎస్ క్యాడర్ బిజీబిజీగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు తగ్గిపోయింది.

'ఉప ఎన్నిక సందర్భంగా నెల రోజుల పాటు విలాసవంతమైన పార్టీలు ఇచ్చారు. మాకు గొప్ప అనుభవం ఎదురైంది. మరే ఇతర పనిలో పాల్గొనడానికి సమయం లేదు. ఇప్పుడిప్పుడే వేరే పనుల్లోకి వెళ్తున్నాం. మళ్లీ ఇటువైపు ఒక్క నేత కూడా చూడట్లేదు. మేం కూడా ఎంజాయ్ చేశాం. ఇప్పుడు పనుల్లో నిమగ్నమవుతుంటే కాస్త ఇబ్బందిగానే ఉంది.' అని మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి చెప్పారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఓటర్ల(Voters)కు ఒక్కో విధంగా సౌకర్యాలు కల్పించారు. రెండు నెలలు అద్దె ఇళ్లు, ఫంక్షన్ హాళ్లకు భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడు అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించిన రోజువారీ ఆదాయం నిలిచిపోవడంతో వ్యవసాయం, చేనేత కార్మికులు తమ పనులను తిరిగి ప్రారంభించారు.

'ఎన్నికల సమయంలో ఇళ్లకు భారీ డిమాండ్ ఉంది. కొంతమంది నేతలకు ఇళ్లు కూడా దొరకలేదు. 50 నుంచి 70 వేల వరకు అద్దె ఇచ్చిన ఉన్న వాళ్లూ ఉన్నారు. నిజం చెప్పాలంటే వచ్చిన వారి డిమాండ్ ను తీర్చలేకపోయాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సాధారణ స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు అద్దెకు ఇస్తున్నాం. రూ.5 వేల నుంచి 9 వేల లోపు అద్దెకే ఇస్తున్నాం.' అని ఓ ఇంటి యజమాని తెలిపారు.

'ఎన్నికల ప్రచారం(Election Campaign)లో మా రోజువారీ వ్యాపారం రెండు లక్షలకు చేరుకుంది. ఇప్పుడు రూ.50వేలు కూడా కావట్లేదు. డిమాండ్‌ను తీర్చడానికి, మేం ఎక్కువ మంది కార్మికులను నియమించాం. పార్కింగ్(Parking) సౌకర్యాన్ని కల్పించాం. ఎన్నికల అనంతర కాలంలో సాధారణ పరిస్థితులను కష్టంగానే ఉన్నాయి.' అని ఓ హోటల్ యజమాని తెలిపారు. .

ఉపఎన్నిక(By poll) సందర్భంగా ఊరూవాడ అంతా అదే ఊపులో ఉన్నారు. చాలా వరకు వ్యవసాయ పనులు, ఇతర పనులు కూడా వెనక పడ్డాయి. జనాలు నేతల చుట్టూ తిరగడానికి సరిపోయేది. ఊర్లలో 500 వరకు ఇచ్చి మిటింగ్స్ కు తీసుకెళ్లేవారు. ఓ రకంగా రెండు నెలలపాటు మునుగోడు ప్రజల(Munugode People)కు ఎన్నికల ఉపాధి దొరికినట్టైంది. ఇప్పుడు సాధారణ పరిస్థితులు వచ్చేసరికి.. ఇక మళ్లీ పాత కథే నడుస్తోంది. అయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూడా కొంతమంది అంటున్నారు. గెలిచిన పార్టీ చేస్తానన్న పనులు చేయాలని కోరుతున్నారు.