KCR Yadadri Tour| సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన.. పునర్నిర్మాణ పనులు పరిశీలన
Published Feb 07, 2022 06:07 PM IST
- తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. మార్చి 28న తలపెట్టే సుదర్శన యాగం నిర్వహణ ఏర్పాట్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు.
యాదాద్రిలో సీఎం కేసీఆర్
Yadadri | తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం యాదాద్రి పర్యటనలో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం యాదాద్రి వెళ్లిన సీఎం.. హెలికాప్టర్ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను విహంగ వీక్షణం చేస్తూ పరిశీలించారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామి వారికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తూ.. అభివృద్ధి పనులను పరిశీలించారు. కళ్యాణ కట్ట, పుష్కరిణి నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
సుదర్శన యాగం ఏర్పాట్లపై సీఎం ఆరా
మార్చి 28న తలపెట్టిన మహా కుంభ సంప్రోక్షణ, సుదర్శన యాగం కొరకు యాగ స్థలాన్ని సీఎం పరిశీలించారు. సుమారు 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ మహా యాగానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. అలాగే అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణాలను పరిశీలించారు. పుష్కరిణిలో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలను సీఎం పరిశీలించారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్ తదితరులున్నారు.
యాదాద్రి ఆలయానికి సంబంధించిన పునర్నిర్మాణ పనులు సుదర్శన యాగం నిర్వహణ కోసం ఏర్పాట్లుపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.