Statue of Equality | సమతా మూర్తి విగ్రహాన్ని చూడటానికి క్యూ కడుతున్న వీఐపీలు
07 February 2022, 6:46 IST
- శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని భారీ సమతామూర్తి విగ్రహం ఓ దివ్యక్షేత్రంగా మారాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అందుకు తగినట్లే మొదట్లోనే ఇక్కడికి వీఐపీల తాకిడి పెరిగింది. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెళ్లిన వెంటనే ఎంతోమంది వీఐపీలు ఇక్కడికి క్యూ కడుతున్నారు.
ఆదివారం సమతా మూర్తిని దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
హైదరాబాద్: సమతా మూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలుసు కదా. ఇప్పుడీ విగ్రహాన్ని చూడటానికి సామాన్య భక్తులతోపాటు ఎంతోమంది వీఐపీలు వస్తున్నారు. శనివారం ప్రధాని మోదీ వచ్చి వెళ్లాక ఆదివారం పలువురు ప్రముఖులు ఇక్కడికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, ఇతర హైకోర్టు జడ్జ్‌లు జస్టిస్ పొన్నగంటి నవీన్ రావు, జస్టిస్ అభిషేక్ రెడ్డి, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్, ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదివారం సందర్శించి చిన్న జీయర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఇక సోమవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా సమతామూర్తిని దర్శించుకునేందుకు ముచ్చింతల్ వస్తున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగనున్నారు. ఆ తర్వాత మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బుధవారం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గురువారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రానున్నారు. ఇక ఈ నెల 11, 12, 13 తేదీల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమతామూర్తిని సందర్శించనున్నారు.