CM KCR | 'బీజేపీని తరిమి కొట్టకపోతే.. దేశం నాశనమైతది..'
Published Feb 13, 2022 06:24 PM IST
- ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. విద్యుత్ సంస్కరణలు, రఫేల్ ఒప్పందంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్థిక మోసాలు పెరిగిపోయాయని తెలిపారు. విద్వేష రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. యువత వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని.. బీజేపీని కేంద్రం నుంచి తప్పించాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. విద్యుత్ సంస్కరణల పేరుతో రాజ్యాంగాన్ని.. బీజేపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఈ సందర్భంగా.. విద్యుత్ ముసాయిదా బిల్లుపై మాట్లాడారు.
"ఓ బహిరంగ సభకు మోదీ వచ్చారు. వచ్చి.. పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఇక విద్యుత్ ముసాయిదా బిల్లును పార్లమెంట్లో ఆమోదించకుండా.. సంస్కరణలు అమలుచేస్తోంది కేంద్రం. సంస్కరణలు అమలు చేస్తే 0.5శాతం ఎఫ్ఆర్బీఎం ఇస్తామని చెబుతోంది. ఇవన్నీ ఈ నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే ఉన్నాయి. విద్యుత్ మీటర్లను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎఫ్ఆర్బీఎం అందితే.. తెలంగాణకు కూడా 5ఏళ్లకు.. రూ. 25వేల కోట్లు అందుతాయి. కానీ మేము రైతన్నల పక్షాన నిలబడి.. వాటిని అమలు చేయడం లేదు. విద్యుత్ సంస్కరణలు చేపడితే.. రైతులకు నష్టమని తెలిసే.. రూ. 25వేల కోట్లను కూడా వదులుకుంటున్నాము," అని కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశం నష్టపోయిన అంశాలపై రచయితలు, జర్నలిస్టులు పుస్తకాలు రాస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఆ పుస్తకాలపై ప్రముఖ హార్వడ్ యూనివర్సిటీలోనూ చర్చలు జరగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీని తరిమికొట్టకపోతే.. దేశం నాశనమవుతుందని ఆరోపించారు.
'ఆర్థిక మోసాలే ఎక్కువ..'
మోదీ పాలనలో దేశవ్యాప్తంగా ఆర్థిక మోసాలు పెరిగిపోయాయని మండిపడ్డారు కేసీఆర్. 33మంది.. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు వెళ్లిపోయారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే పార్లమెంట్‌కు చెప్పిందని గుర్తుచేశారు. రైతన్నలు కష్టాలు పడుతుంటే.. మోసం చేసిన వారు వీదేశాల్లో హాయిగా ఉంటున్నారని వెల్లడించారు. వారిలో సగం మంది గుజరాత్వాసులేనని పేర్కొన్నారు.
ఇక ఎన్నికలు ఉన్నాయనే కేంద్రం.. పెట్రోల్ ధరలు పెంచడం లేదని కేసీఆర్ అన్నారు. ఒక్కసారి ఎన్నికలు ముగిస్తే.. ధరలకు రెక్కలొస్తాయని, తన మాట రాసిపెట్టుకోవాలని చెప్పారు.
'రఫేల్ ఒప్పందంలో గోల్మాల్..'
రఫేల్ ఒప్పందంలో గోల్మాల్ జరిగిందని ఆరోపించారు కేసీఆర్. 36 జెట్లను 9.6బిలియన్ డాలర్లకు ఇండియా కొనుగోలు చేసిందన్నారు. ఇటీవలే.. ఇండోనేషియా ప్రభుత్వం.. 44 రఫేల్ జెట్లను కేవలం 8 బిలియన్ డాలర్లకు కొందని పేర్కొన్నారు. బీజేపీ వల్ల అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. త్వరలో ఈ విషయంపై సుప్రీంకోర్టుకు, ప్రజాకోర్టుకు వెళ్లతామని తెలిపారు.
'యువత ఆలోచించాలి'
దేశ యువత మధ్య విద్వేషాన్ని రగిల్చేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు. యువత వీటన్నింటిని గమనించాలని పేర్కొన్నారు.
'కర్ణాటకలో ఏం జరుగుతోందో మనం చూస్తూనే ఉన్నాము. బీజేపీ ఏం చేస్తోందో చూస్తూనే ఉన్నాము. ఈ విషయంపై ప్రధానే కాదు మొత్తం దేశ మౌనం వహిస్తోంది. ఇది దారుణం. కర్ణాటకలో జరిగింది.. దేశం మొత్తానికి పాకితే పరిస్థితి ఏంటి? ఇది అస్సలు మంచి విషయం కాదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా.. సరిహద్దుల్లో ఏదో ఒకటి జరుగుతుంది. రాష్ట్రాల్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇండియాకు ఇది అవసరం లేదు. భగవంతుడి పేరుతో, మతం పేరుతో హింస సృష్టిద్దామనుకోవడం ఏంటి? అసలు ఈ దేశం ఎక్కడికి వెళుతోంది? దేశంలో నిత్యం ఏదో ఒకచోట కర్ఫ్యూలు, హింసలు ఉండాలా? లేక ప్రజలు ఉద్యోగాలు చేసుకుంటూ సుఖంగా ఉండాలా? హింస ఉంటే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? నేటి యువతే.. రేపు దేశాన్ని నిర్మిస్తుంది. బీజేపీ విద్వేష రాజకీయాలను యువత గమనించాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి,' అని కేసీఆర్ అన్నారు.
'నేను అందరిని కలుస్తా..'
ఈ సందర్భంగా.. థర్డ్ ఫ్రంట్‌పై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు కేసీఆర్.
"బీజేపీని పంపించేయాలి. అందుకోసం నేను పనిచేస్తాను. అస్సాం సీఎం.. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీయేనా అని ప్రశ్నించారు. దానిని నేను తప్పుబట్టాను. ఆ మాటలు సరైనవి కావు. అలా అని నేను కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్టు కాదు. మోదీ ప్రభుత్వాన్ని తప్పించేందుకు ప్రజలే ముందుకురావాలి. ప్రజలు కదిలితేనే, నేతలు కదులుతారు.. అప్పుడే ప్రతిఫలం లభిస్తుంది. తెలంగాణ పోరాటంలో ముందు ప్రజలే కదిలి వచ్చారు. తర్వాత నేతలు వచ్చారు. ఎప్పుడూ సమైఖ్య ఆంధ్ర అనే చంద్రబాబు కూడా 'జై తెలంగాణ' అన్నారు. ఇది ప్రజల వల్లే జరిగింది. అయితే బీజేపీని పంపించడంలో నాది కీలక పాత్ర ఉంటుంది. మొన్ననే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాతో ఫోన్లో మాట్లాడారు. త్వరలో హైదరాబాద్‌కు వస్తారు. మేము చర్చిస్తాము. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నాకోసం ఎదురుచూస్తున్నారు. నేను కూడా వెళ్లి కలిసి చర్చిస్తా. బీజేపీని తప్పించడమే ధ్యేయం," అని స్పష్టం చేశారు కేసీఆర్.
'అవును రాజ్యాంగాన్ని మార్చాలి..'
రాజ్యాంగాన్ని మార్చాలన్న తన వ్యాఖ్యలను కేసీఆర్ సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా.. మరింత వివరణ ఇచ్చారు. దళితులకు, ప్రజలకు, రైతులకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగాన్ని మార్చాలని తాను అభిప్రాయపడినట్టు వెల్లడించారు. అంతేకానీ అంబేడ్కర్‌ను కించపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
'మొరుపుదాడులు జరిగాయా..?'
2016లో మెరుపుదాడులు జరిగాయా? అని రాహుల్ గాంధీతో పాటు తాను కూడా ప్రశ్నిస్తున్నట్టు కేసీఆర్ అన్నారు. ప్రజలకు బీజేపీ ఎప్పుడూ అబద్ధాలే చెబుతోందన్నారు. ప్రజలకు నమ్మకం లేదని.. అందుకే రాహుల్‌తో పాటు తాను కూడా ఆధారాలు అడుగుతున్నట్టు పేర్కొన్నారు.
“ఎన్నికలు జరిగినప్పుడల్లా సరిహద్దుల్లో ఏదో ఒకటి జరుగుతోంది. దానికి బీజేపీ క్రెడిట్ తీసుకుంటోంది. ఇదేలా సాధ్యం? సరిహద్దుల్లో పోరాడుతోంది జవాన్లు. వీరమరణం పొందుతోంది జవాన్లు. కానీ క్రెడిట్ మాత్రం బీజేపీ తీసుకుంటోంది. ఎందుకు? దీనిపై ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. అడిగితే తప్పేముందు? రాహుల్ గాంధీ మాత్రమే కాదు.. మెరుపుదాడులకు ఆధారాలు ఇవ్వాలని ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను,” అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
'మోదీని కలవకపోవడానికి అదే కారణం'
ఇటీవలే ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. ముచ్చింతల్‌లో జరిగిన రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. కాగా కేసీఆర్ మోదీని కలవలేదు. తాజాగా.. దీనిపై కేసీఆర్ స్పందించారు. ఇది చాలా సింపుల్ విషయమన్నారు. తన ఇంట్లో ఇద్దరికి కొవిడ్ సోకిందని వెల్లడించారు. ఆ పరిస్థితుల్లో ప్రధానిని కలవడం మంచిది కాదనే వెళ్లలేదని పేర్కొన్నారు. కాని కొందరు దీనిపై తప్పుడు రాతలు రాశారని.. తాను పట్టించుకోలేదని స్పష్టం చేశారు.